– 18న ఖమ్మంలో భారీ ర్యాలీకి సన్నాహాలు
– 19, 20, 21 తేదీల్లో జాతీయ కౌన్సిల్ సమావేశం
– సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వెల్లడి
ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 8: సీపీఐ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలో ఈ నెల 18న సీపీఐ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. జాతీయ నాయకులంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారని పేర్కొన్నారు. 18న నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా సంఘీభావంగా ఈ ర్యాలీలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో రామకృష్ణ గురువారం పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవన్‌కు వెళ్లారు. అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీపీఐ ఆవిర్భావం నుంచి పోరాటాల పంథా కొనసాగించిందని తెలిపారు. పేదలు, కార్మికుల హక్కుల కోసం ఎంతోమంది జైలుకు వెళ్లారన్నారు. దేశం కోసం సీపీఐ ఎన్నో త్యాగాలు చేసిందని ప్రస్తావించారు. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పోరాటాల గడ్డ ఖమ్మంలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఖమ్మంలో జాతీయ కౌన్సిల్ సమావేశం ఉంటుందని తెలిపారు. 20న వామపక్ష పార్టీల జాతీయ నాయకులు ఆహ్వానించి సెమినార్ ఏర్పాటు చేశామన్నారు. 18 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఈ సెమినార్‌కు ఎనలేని ప్రాధాన్యత ఉందని వివరించారు. సెమినార్‌లో వామపక్ష పార్టీలు పాల్గొంటాయని వెల్లడించారు. వామపక్ష పార్టీలు దేశంలో ఇతర పార్టీలను కలుపుకొని పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి 2027 మార్చి నాటికి పోలవరం పూర్తిచేసి జాతికి అందిస్తామని అంటున్నారని, ఇది సంతోషకరమన్నారు. పోలవరం ఏర్పాటుకు త్యాగాలు చేసిన భూ నిర్వాసితుల పరిస్థితి గురించి మాట్లాడటం లేదని అన్నారు. ఆగస్టు నెల వస్తే ఆ మండలాల్లోనే గ్రామాలు మునిగిపోతున్నాయని చెప్పుకొచ్చారు. 135 అడుగుల వరకు మాత్రమే సాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ముంపు బాధితులను గాలికి వదిలేశారని ఆరోపించారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ డిమాండ్ చేస్తోందని అన్నారు. మావోయిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆపరేషన్ కగార్‌ను సీపీఐ ఖండిస్తోందని తెలిపారు. తక్షణమే నక్సల్స్‌తో చర్చలు జరపాలని కోరారు. మావోయస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ కూడా బూటకమేనని, పట్టుకొచ్చి కాల్చి చంపారని ఆరోపణలు చేశారు. ప్రశ్నించే వాళ్లని అర్బన్ నక్సల్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని రామకృష్ణ విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





