-కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం
– ఆంధ్రపాలకులకు మేలు చేసిన బీఆర్ ఎస్
– గత ప్రభుత్వం తప్పులను సరిదిద్దుతున్నాం
-పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం
– తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: బనకచర్ల విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వానిదే తప్పని, తెలంగాణ వాటాను తాకట్టుపెట్టి రాజకీయం చేసిందని, అదేవిధంగా కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి భాజపా రాజకీయం చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం చేకూరుతుందని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ,టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ల నేతృత్వంలో కొనసాగుతున్న “జనహిత పాదయాత్ర” లో భాగంగా పరిగి లోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు .అనంతరం పరిగి పట్టణంలోని ఎస్ గార్డెన్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశం పరిగి ఎమ్మెల్యే,డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బిఆర్ఎస్ పై మండిపడ్డారు. బనకచర్ల విషయంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్ర పాలకులకు మేలు చేసిందని ఆరోపించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దేందుకు సిద్ధంగా ఉందని, ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే టిఆర్ఎస్ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో గత పాలకులు చేసిన తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, అందుకోసమే కేంద్రానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుకట్ట వేశామన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని కార్యకర్తలు ఇంటింటికీ వెళ్ళి వివరించాలని అన్నారు.పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నిస్వార్థంగా, ఆత్మీయంగా,అంకితభావంతో పని చేసిన కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి అసలైన శక్తి అని, అలాంటి త్యాగస్వరూపులైన కార్యకర్తలను పార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందన్నారు.ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే, అది కార్యకర్తల కష్ట ఫలితమని,తాము పొందిన ప్రతి పదవీ, ప్రతి గౌరవం కార్యకర్తల తపనకు, సమర్పణకు, సేవాభావానికి నిదర్శనం అని, వారి బాధ్యతను మేము ఎప్పటికీ మరిచిపోము అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్లను కేటాయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అణగారిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తామని, రాజ్యాంగబద్ధమైన పదవులను వారికిచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.బీసీలకు స్థానికసంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని,ఇచ్చిన హామీకి తాము కట్టుబడి ఉన్నామని బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఉద్దేశంతోనే బిజెపి ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా ఆగస్టు 5.6.7 తేదీలలో తెలంగాణ సీఎం సహా మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి “ఛలో ఢిల్లీ” కార్యక్రమం చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి సామాజిక న్యాయాన్ని స్థాపించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని నాయకులకు పిలుపునిచ్చారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక అభ్యర్థి అన్నట్టుగా భావించి,అందరూ కలిసికట్టుగా శ్రమించాలనీ,సర్పంచ్,ఎంపీటీసీ,జెడ్పిటిసి, అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.పార్టీ తరపున అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల హక్కుల కోసం, ప్రేమతో, సేవాభావంతో పనిచేస్తుంటే బీజేపీ మాత్రం విద్వేషం రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తోంది” అని స్పష్టం చేశారు.”మహాత్మా గాంధీ సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకం.వారి ఆదర్శాలను అనుసరించడమే నిజమైన దేశసేవ” అని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ స్వయంగా చరఖా తో నూలు వడికి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. చరఖా ద్వారా స్వదేశీ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, స్వయం ఉపాధికి అది చిహ్నమని ఆమె పేర్కొన్నారు. చరఖా ఉపయోగించే విధానాన్ని ఎమ్మెల్యే వర్ణిక రెడ్డి ద్వారా మహిళా నాయకురులకు వివరించారు. చరఖా వాడకంతో వచ్చే ఆత్మనిర్భరత, సమాజానికి ఉపయోగాలు వివరించారు.చేనేత వస్త్రాలు వాడడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని,స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం దేశ ఆర్థిక వ్యవస్థకు బలమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ,ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ యుఐ నేతలు, మహిళా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





