-ఎస్.కే.జోషి, స్మితా సబర్వాల్ నిర్లక్ష్యంతోటే
-పూర్తిగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు
– కేబినెట్ ఆమోదం లేకుండానే పరిపాలనా అనుమతులు
– జస్టిస్ పినాకి చంద్రబోస్ నివేదికలో వెల్లడి
– మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: మేడిగడ్డ బ్యారేజ్ కూలిన పాపం ముమ్మాటికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులదేనని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కూలిపోయిన మేడిగడ్డ ఉదంతం పై అధికారంలోకి వస్తే న్యాయవిచారణ జరిపిస్తామని ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, నాటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించి సమగ్ర న్యాయవిచారణ జరిపించామన్నారు. జస్టిస్ చంద్రఘోష్ ఇచ్చిన 660 పేజీల నివేదికపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. నిపుణుల హెచ్చరికలను ఖాతరు చేయకపోవడమే ఇంతటి విపత్తుకు కారణమైందని ఘోష్ నివేదికలో తెలిపిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2015లో విడుదల చేసిన జి.ఓ నెం.28 ద్వారా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ వేమనపల్లిలో నిర్మించాలని చేసిన సూచనలు పట్టించుకోకుండా మేడిగడ్డ వద్ద చేపట్టిన నిర్మాణం పూర్తిగా వ్యర్థం అని నివేదిక స్పష్టం చేసిందన్నారు. ఉద్దేశపూర్వకంగా నాటి ముఖ్యమంత్రి, నీటిపారుదల మంత్రికి అనుకూలంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారని కమిషన్ వెల్లడిరదని తెలిపారు. 37వేల కాంక్రీట్ నమూనాలను, 7,498 మాత్రమే పరిశీలించారని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక పేర్కొందని, అనకూలంగా ఉన్నచోట నిర్మాణం చేపట్టకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిరదని ఉత్తవమ్ అన్నారు. మూడు బ్యారేజ్‌లకు జి.ఓ.నెంబర్లు 231, 232లకు కేబినెట్ ఆమోదం లేదని కమిషన్ స్పష్టం చేసిందన్నారు. ఆ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఆమోదం చట్టబద్దంగా చెల్లదని నివేదికలో తేటతెల్లం అయిందన్నారు. 2019, 2021లలో మెడిగడ్డకు ఇచ్చిన అనుమతులు కుడా పూర్తిగా తప్పువని కమిషన్ తేల్చిచెప్పిందని, బ్యాంక్ గ్యారెంటీలలో కుడా అవకతవకలు చోటుచేసుకున్నాయని గుర్తించిందని చెప్పారు. దురుద్దేశపురకంగా ఎలాంటి ప్రాజెక్టు నివేదిక లేకుండానే రూ.369 కోట్ల విలువైన పనులు ఏజెన్సీలకు లబ్ది చేకూర్చే విధంగా రూపొందించారన్నారు. బయటి రుణాల పేరుతో కే.ఐ.పి.సి.ఎల్ సంస్థ వద్ద ప్రభుత్వ హామీతో చేసిన రూ.87,449 కోట్లకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.29,737 కోట్లు చెల్లించగా ఇంకా చెల్లించాల్సిన మూల ధనం రూ.64,212 కోట్లు కాగా ఇంకా రూ.41,638 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉందన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన అనంతరం పెరిగిన ధరల ప్రకారం అదనంగా రూ.1342 కోట్లు చెల్లించడంతోపాటు అక్రమంగా మరో రూ.612 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారన్నారు. వీటన్నింటికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌లతోపాటు ఎస్.కే.జోషి, స్మితా సబర్వాల్‌లు బాధ్యత వహించాలని కమిషన్ పేర్కొన్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.





