ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై అవగాహన పెరగాలి

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

మొయినాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ఇవి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, పర్యావరణ సమతుల్యతకు, జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం తోల్‌కట్ట గ్రామంలోని పీవీ నర్సింహారావు మెడిసినల్‌ గార్డెన్‌ లో బుధవారం ఏర్పాటు చేసిన ఆరోమెటిక్‌ అండ్‌ మెడిసినల్‌ ప్లాంట్స్‌ ప్లాంటేషన్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయుర్వేదం, సిద్ధ వంటి సంప్రదాయ వైద్య విధానాల్లో ఔషధ మొక్కల పాత్ర ఎంతో గొప్పదని, వేప, తులసి, అల్లం వంటివి నిత్య జీవితంలో మనకు ఎంతగానో ఉపకరిస్తాయని ఆయన వివరించారు. ఈ మొక్కల పెంపకం రైతులకు మంచి ఆదాయ వనరుగా మారే అవకాశం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నదన్నారు. ‘ప్రాణహిత- చేవెళ్ల’ ప్రాజక్టు ద్వారా సాగునీటిని అందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ చొరవ తీసుకుంటే, ఆ తర్వాత అధికారంలోకొచ్చిన కేసీఆర్‌ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ గడ్డకు విముక్తి కల్పించేందుకు ఎంతో మంది మహనీయులు పోరాటం చేశారని, వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. స్వామి రామానంద తీర్థ, పీవీ నర్సింహారావు తదితర నాయకుల స్ఫూర్తితో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా పక్కా ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, పీవీ ప్రభాకర్‌ రావు, శేఖర్‌ మారంరాజు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *