పరిస్థితుల‌నుబ‌ట్టి వైద్య వ్యస్థలో మార్పులు రావాలి

– డయాలసిస్‌ కేంద్రాలు మరిన్ని పెంచాలి
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: జీవనశైలి వ్యాధుల సమస్య ఎక్కువైనందున ఇందుకు అనుగుణంగా వైద్య వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో కొత్త డయాలసిస్‌ సెంటర్ల ఏర్పాటుపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కిడ్నీ జబ్బులు, డయాలసిస్‌ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. కిడ్నీ, కేన్సర్‌ జబ్బులు పెరగడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ఒకప్పుడు అంటువ్యాధుల సమస్య ఉండేదని, ఆ వ్యాధుల నియంత్రణకు అనుగుణంగానే మన వైద్య రంగం తయారు చేయబడిరదన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైందని, అంటువ్యాధులు తగ్గిపోయి, నాన్‌ కమ్యినికేబుల్‌ డిసీజ్‌లు పెరిగిపోయాయన్నారు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన సెడెంటరీ లైఫ్‌ స్టైల్‌ వంటి అనేక కారణాల వల్ల కుగ్రామంలో కూడా బీపీ, షుగర్‌, కిడ్నీ, గుండె జబ్బులు, కేన్సర్లు పెరుగుతున్నాయన్నారు. ఇప్పుడు మారిన పరిస్థితులకనుగుణంగా వైద్య వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై స్టడీ చేయాలని, ఇతర దేశాల్లో అవలంబిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. నాన్‌ కమ్యునికెబుల్‌ డిసీజ్‌ల నివారణ, నియంత్రణ, చికిత్స అంశాలపై ఎక్కువగా ఫోకస్‌ చేయాలన్నారు. నాన్‌ కమ్యునికెబుల్‌ డిసీజ్‌లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ఆరోగ్యకరమైన జీవన విధానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయా జబ్బుల బారిన పడిన ప్రజలకు చికిత్స అందించేందుకు అనుగుణంగా మన హాస్పిటల్స్‌ తయారు కావాలన్నారు. అందులో భాగంగానే ఎన్‌సీడీ క్లినిక్‌లు, కేన్సర్‌ డే కేర్‌ సెంటర్లు పెట్టుకున్నామని గుర్తు చేశారు. డయాలసిస్‌ పేషెంట్లు మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారని, వారికి పెన్షన్‌ అందించి కొంత వరకూ ఆర్థికంగా బాసటగా నిలుస్తున్నామన్నారు. కానీ అది మాత్రమే సరిపోదన్నారు. ప్రతి గ్రామం, ప్రతి పట్టణానికి సమీపంలోనే అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా డయాలసిస్‌ పేషెంట్లకు అందాలన్నారు. . ప్రతి 20 లేదా 25 కి.మీకు ఓ డయాలసిస్‌ సెంటర్‌ ఉండాలని, ఇందుకనుగుణంగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని హెల్త్‌ సెక్రటరీని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే ఉన్న సెంటర్లలో అవసరమైనచోట మిషన్ల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా 16 డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వీటితో కలిపి ప్రస్తుతం 102 డయాలసిస్‌ సెంటర్లు ఉన్నాయని, ఈ సెంటర్లలో సుమారు 7,550 మంది పేషెంట్లు డయాలసిస్‌ చేయించుకుంటున్నారని, ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్‌ హాస్పిటళ్లలో మరో 5,060 మందికి ఉచితంగా డయాలసిస్‌ సేవలు అందిస్తున్నామని అధికారులు మంత్రికి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *