– కౌన్సెలింగ్ పొడిగింపుపై సుప్రీంకోర్టు విచారణ
న్యూదిల్లీ, మార్చి 23 : తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్ సీట్ల భర్తీ కౌన్సెలింగ్ పొడిగింపుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ పొడిగింపునకు సంబంధించి అనుమతి ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని మెడికల్ కమిషన్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని, సీట్లు వృథా కాకుండా చూడాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. సీట్ల భర్తీ కౌన్సెలింగ్ పొడిగింపు అంశంపై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఖాలీగా ఉన్న మెడికల్ పీజీ సీట్ల భర్తీ వ్యవహారంపై వైద్య విద్య కళాశాల యాజమాన్యాలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఫిబ్రవరి 28వ తేదీతో కౌన్సెలింగ్ ముగిసిందని, అయితే ఆ తేదీకి ఆంధప్రదేశ్‌లో 246 సీట్లు, తెలంగాణలో 377 పీజీ సీట్లు భర్తీ కాలేదని న్యాయస్థానం దృష్టికి కాలేజీ యాజమాన్యాలు తీసుకువచ్చాయి. వీటిలో ఏపీలో సుమారు 45 కన్వీనర్ కోటా సీట్లు కూడా ఉన్నాయని జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ అలోక్ అరాథే ధర్మాసనం దృష్టికి యాజమాన్యాల తరపు న్యాయవాదులు తీసుకువచ్చారు. కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని, కానీ గడువు ముగియడంతో కౌన్సెలింగ్ ముగించారని యాజమాన్యాలు ప్రస్తావించాయి. గడువు పెంచాలని ఫిబ్రవరి 28వ తేదీకి ముందే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)కి సంబంధిత యూనివర్సిటీలు, కాలేజీలు విజ్ఞప్తి చేశాయి. యాజమాన్యాలు విజ్ఞప్తి చేసినా ఎన్‌ఎంసీ నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదని కోర్టుకు న్యాయవాదులు చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




