– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కె.టి.ఆర్ విజ్ఞప్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలలో అర్హత సాధించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్ధానికత జీవో కారణంగా ప్రవేశాలకు అనర్హులుగా మిగిలిపోతున్న తెలంగాణ విద్యార్థుల ఆవేదనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకురావడానికి తెలంగాణ భవన్కు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కేటీఆర్ సమావేశమయ్యారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికతకు సంబంధించి ఒక ఇబ్బందికరమైన జీవోను తీసుకువచ్చిందని విద్యార్థులు కేటీఆర్కు తెలిపారు. గతంలో పదవ తరగతి వరకు 7 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణించే నిబంధన ఉండేదని, అయితే ఇప్పుడు 9, 10, 11, 12 తరగతులు వరుసగా చదివిన వారికే స్థానికత వర్తిస్తుందని, వారికే మెడికల్ సీట్ల అడ్మిషన్లు దక్కుతాయని కొత్తగా ఇచ్చిన ఆదేశాల వల్ల వందల మంది విద్యార్థులు నష్టపోతున్నారని వివరించారు. పదో తరగతి వరకు తెలంగాణలో చదివిన తర్వాత అత్యుత్తమ శిక్షణ కోసం ఆంధ్రాతోపాటు అనేక నాన్-తెలుగు రాష్ట్రాలలో కోచింగ్ తీసుకుని నీట్ పరీక్షలకు సన్నద్ధమయ్యారని, ఇప్పుడు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అర్హత సాధించినప్పటికీ ప్రభుత్వం వారిని అనర్హులుగా ప్రకటించి ప్రవేశాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమస్యలను విన్న కేటీఆర్వెం టనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. ఈ సమస్యను సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తుందని తెలిపారు.కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం పాలసీపరమైన మార్పులు లేదా స్థానికతకు సంబంధించిన అర్హతలను మార్చినప్పుడు వాటిని గతానుగతంగా కాకుండా భవిష్యత్తు కోసం ఒక కటాఫ్ డేట్ పెట్టి, రెండు లేదా మూడు సంవత్సరాల సమయం ఇస్తే బాగుంటుందని సూచించారు. కానీ, విద్యార్థులు అప్పటికే తమ ఇంటర్మీడియట్ కోసం ఇతర ప్రాంతాల్లో చదువుతూ ప్రిపేర్ అవుతున్న వారిని పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిన ఆదేశాల వల్లనే ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. మానవతా కోణంలో నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొని విద్యార్థులకు ఉపశమనం కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





