మెడికల్‌ కాలేజీలకు పాలనాధికారులు

~ టీచింగ్‌ హాస్పిటళ్లకు ప్రిన్సిపాల్స్‌, సూపరింటెండెంట్ల నియామకం
~ 44 మందికి మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అడిషనల్‌ డైరెక్టర్లుగా పదోన్నతి
~ జీవో జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, టీచింగ్‌ హాస్పిటళ్లకు రెగ్యులర్‌ పద్ధతిలో పరిపాలనాధికారులను ప్రభుత్వం నియమించింది. 44మంది సీనియర్‌ ప్రొఫెసర్లకు అడిషనల్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించింది. వారందరినీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌గా, టీచింగ్‌ హాస్పిటళ్లకు సూపరింటెండెంట్లుగా నియమించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 278మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ చివరి దశకు వచ్చింది. ఏడీఎంఈల పోస్టింగ్‌ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ప్రొఫెసర్లుగా ఉన్నతి పొందిన వారికి కూడా ప్రభుత్వం త్వరలో పోస్టింగ్స్‌ ఇవ్వనున్నది. ఈ ప్రమోషన్లతో అన్ని కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత, డిపార్ట్‌మెంట్‌ హెచ్‌వోడీల సమస్య తీరనున్నది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుమారు 231 మందికి అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌, అడిషనల్‌ డీఎంఈ వంటి పోస్టులను నేరుగా రిక్రూట్‌ చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రమోషన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నది. 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవలే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇవిగాక సుమారు మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ పోస్టులను సైతం త్వరలోనే భర్తీ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *