– తుది ఉత్తర్వులకు లోబడే ప్రవేశాలు
– మెడికల్ కోర్సుల అడ్మిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23: మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్/డెంటల్ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా తెలంగాణకు చెందిన విద్యార్థుల దరఖాస్తులను స్వీకరించాలని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నాలుగేళ్లు రాష్ట్రంలో చదివి ఉండాలన్న నిబంధన వర్తించడం లేదని చెప్పి దరఖాస్తులను తిరస్కరించరాదని, తెలంగాణ విద్యార్థులందరి దరఖాస్తులను స్వీకరించాలని, దరఖాస్తుల ప్రక్రియను కొనసాగించాలని తేల్చిచెప్పింది. అయితే అడ్మిషన్లు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ పి.శ్యాంకోశీలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్/డెంటల్ కోర్సుల అడ్మిషన్ల నిమిత్తం కాళోజీ యూనివర్సిటీ ఈనెల 15న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు దాఖలు చేన వ్యాజ్యాలను హైకోర్టు విచారించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది అల్లూరి దివాకర్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు బి.మయూర్‌రెడ్డి, జె.రామచంద్రరావులు వాదనలు వినిపిస్తూ గత ఏడాది హైకోర్టు తీర్పు ప్రకారం అడ్మిషన్లు కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. అడ్మిషన్‌కు ముందు నాలుగేళ్లు తెలంగాణలో చదివి ఉండాలన్న నిబంధన వల్ల రాష్ట్రానికి చెందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మెరుగైన విద్య కోసం, లేదా తల్లిదండ్రుల బదిలీ, ఇతరత్రా కారణాల వల్ల రెండేళ్లు వేరే ప్రాంతాల్లో చదివి తిరిగి తెలంగాణకు వస్తే ఇక్కడ స్థానిక కోటా కింద అడ్మిషన్లు నిరాకరించడం చెల్లదని గతంలో హైకోర్టు తీర్పు వెలువరించిందని గుర్తు చేశారు. అంతేగాక శాశ్వత నివాసం ఉన్న వారికి స్థానిక కోటా అడ్మిషన్లు కల్పించడానికి మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. హైకోర్టు తీర్పు మేరకు అడ్మిషన్లు చేపడతామన్న ప్రభుత్వ హామీతో సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చిందన్నారు. అది ఇంకా పెండిరగ్లో ఉండగానే మళ్లీ పాత నిబంధనల ప్రకారమే అడ్మిషన్లు చేపట్టడం చెల్లదన్నారు. స్థానిక కోటా కింద అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించేలా ఆదేశించాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం గత ఏడాది హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దరఖాస్తులను స్వీకరించి ప్రక్రియ కొనసాగించాలని కాళోజీ యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే అడ్మిషన్లు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని షరతు విధించింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.





