ఒక ప్రధాన జాతీయ పత్రిక “కరీనా కపూర్ రోజులో తన చివరి ఆహారం (లాస్ట్ మీల్) 6.30 గంటలకు ముగిస్తుందని, లాస్ట్ మీల్ తీసుకోవాల్సిన సమయం చాలా ముఖ్యం” అనే అర్ధం వచ్చేలా తన సోషల్ మీడియా హ్యాండిల్ లో కరీనా కపూర్ ఆహారపు అలవాట్ల గురించి పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ ఈ విధంగా ప్రతిస్పదించాడు. “ఇలాంటి చెత్త వార్తలు పబ్లిష్ చేయడం నిజంగా సిగ్గుచేటు. 57% భారతీయ మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని ఇటువంటి సామజిక అంశాలను ఎందుకు పబ్లిష్ చేయరని” అయన అన్నాడు. దాంతో పాటుగా ఈ కింది వ్యాసం పోస్ట్ చేశాడు…
భారతీయ మీడియా ఈ విధంగా వ్యవహరించడం అసాధారణమేమీ కాదు. దేశంలోని వాస్తవ సమస్యలయినటువంటి పేదరికం, నిరుద్యోగం, పసి పిల్లల్లో పోషకాహార లోపం, సామాన్య ప్రజలకు తగిన వైద్య సేవలు, విద్యావకాశాలు లేకపోవడం వంటి అంశాలపై మీడియా దృష్టి ఎందుకు పెట్టడం లేదు?
స్పష్టంగా చెప్పాలంటే, ఇది మీడియా యజమానులకు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఇచ్చిన ఆదేశాల ఫలితం. జరుగు తున్నదేమిటంటే ప్రజల దృష్టిని అసలైన సమస్యల నుండి మళ్లించి, అసంబద్ధమైన లేదా అనవసర విషయాల్లో నిమగ్నం చేయడం. సినీనటుల వ్యక్తిగత జీవితాలు, క్రికెట్, ఫ్యాషన్ షోలు, జ్యోతిష్యం వంటి వాటిలో ప్రజలను ఎంగేజ్ చేయడం జరుగుతుంది. ఇది రోమన్ చక్రవర్తుల నానుడికి అనుగుణంగా ఉంది. ” If you cannot give the people bread, give them circuses “. “ప్రజలకు కూడు, గూడు, గుడ్డ ఇవ్వలేకపోతే వారిని తమ సమస్యలను మర్చిపోయేలా వినోదాల్లో ముంచెత్తండి”.
భారతీయ ప్రధాన మీడియా సంస్థలు చాలా జాగ్రత్తగా, ఉద్దేశపూర్వకంగా ప్రజల దృష్టిని అసలైన సమస్యల నుండి అనవసర విషయాలవైపు మళ్లిస్తోంది. భారతదేశంలోని నెలకొన్నవి సామాజిక-ఆర్థిక సమస్యలే. 75 శాతం మందికంటే ఎక్కువ మంది ప్రజలు పేదరికంలో జీవించటం, భారీ స్థాయిలో నిరుద్యోగం, ఆహారం మరియు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి ఎగబాకడం, సామాన్యులకి తగిన విద్య, వైద్య సేవలు లేకపోవడం, పిల్లలలో భయంకరమైన పోషకాహార లోపం (ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం, భారతదేశంలో ప్రతి రెండో బిడ్డకు పోషకాహార లోపం ఉంది. గత కొన్ని సంవత్సరాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. మొత్తం 125 దేశాల్లో ఇండియా ర్యాంక్ 101 నుండి 107కి పడిపోయింది) మహిళలు, దళితులు, మైనారిటీలపై వివక్ష, పరువు హత్యలు, మతం ఆధారిత విద్వేషాలు… ఇలాంటి పాత కాలపు సామాజిక దురాచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమస్యలపై ప్రధాన మీడియా సంస్థలు దృష్టి కేంద్రీకరించాల్సిన సమయంలో అందుకు భిన్నంగా ప్రజల దృష్టిని క్రికెట్, సినిమా నటుల ప్రైవేటు జీవితాలు, ఫ్యాషన్ షోలు, జ్యోతిష్యం, పాప్ సంగీతం, డిస్కో నృత్యాలు, రియాలిటీ షోల వంటి అనవసర, అసంబద్ధ విషయాల వైపు ప్రజల దృష్టిని మళ్ళిస్తుంది.
ప్రజలకు వినోదాన్ని అందించాలనే విషయంలో మీడియా పట్ల ఎలాంటి అభ్యంతరం లేదు కానీ అది హద్దు మీరకూడదన్నది నా అభిప్రాయం. మీడియా సంస్థలు 90 శాతం కవరేజ్‌ను వినోదానికి కేటాయిస్తూ కేవలం 10 శాతం కవరేజ్‌ను దేశం ఎదుర్కొంటున్న అసలైన సమస్యలకు కేటాయిస్తున్నారంటే మీడియా వ్యవస్థలో ఘోరమైన లోపం ఉందని అర్థం. ఇక్కడ విషయం సమతుల్యత (proportion) కు సంబంధించింది. భారతీయ మీడియాలో ఈ సమతుల్యత తప్పింది. సినిమాలు, క్రికెట్, రియాలిటీ షోలు, ఫ్యాషన్, జ్యోతిష్యం వంటి వినోద అంశాలకు కేటాయిస్తున్న సమయంలో కనీసం 10% కూడా పేదరికం, నిరుద్యోగం, వైద్యసేవలు, పోషకాహార లోపం, విద్య, వైద్యం, కార్మిక సమస్యలు, వ్యవసాయం, పర్యావరణం వంటి సామాజికార్థిక సమస్యలకు కేటాయించడం లేదు.
ఇప్పుడు మనం ఈ ప్రశ్న వేయాలి. ఆకలితో ఉన్నవాడికి, ఉద్యోగం లేనివాడికి కావల్సింది తిండి గింజలు-ఉద్యోగమా లేక వినోదమా? స్పష్టంగా, తిండి మరియు ఉద్యోగమే అవసరం. కానీ మీడియా మాత్రం ఆకలితో ఉన్నవాడికి “వినోదం” అనే సర్కస్ మాత్రమే అందిస్తోంది.కొన్ని రోజుల క్రితం ముంబయిలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ ను 512 మంది గుర్తింపు పొందిన జర్నలిస్టులు కవర్ చేశారు. ఆ ఫ్యాషన్ వీక్‌లో మోడల్స్ పత్తితో తయారు చేయబడిన వస్త్రాలను ప్రదర్శించగా, అదే పత్తిని పండించిన రైతులు ముంబయికి గంట దూరంలోని విదర్భ ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఆ విషాదకరమైన వార్తలను జాతీయ స్థాయిలో ఒకరిద్దరు తప్ప ఎవరూ చెప్పలేదు. మనము టీవిలో వార్తలు విందామని ఏదయినా ఛానల్ పెట్టగానే మనం చూసేది మతప్రచారం, నీచ స్థాయికి దిగజారిన రాజకీయాలు, పాకిస్థాన్‌పై అరుపులు, యుద్ధోన్మాదం, క్రికెట్, సినిమా నటుల జీవితం, జ్యోతిష్యం, బాబాల కథలు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు మీడియా చూపించే కంటెంటుకు ఏమీ సంబంధం లేదు. పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సంక్షోభం, విద్యలేమి, రైతుల ఆత్మహత్యలు, బాలల పోషకాహార లోపం వంటి విషయాల గురించి అసలు మీడియా సంస్థలు చేయించడమే మానేశాయి. దాదాపు అన్ని న్యూస్ ఛానల్స్ పగలూ రాత్రి క్రికెట్‌నే చూపిస్తున్నాయి. క్రికెట్ అనేది భారతీయులకు నిజంగా ఓ మత్తు మందు (opium) లాగా తయారయింది. “ప్రజలకు అన్నం ఇవ్వలేకపోతే, వినోదం (circus) ఇవ్వండి.” అన్న రోమన్ చక్రవర్తుల నానుడిని పాటిస్తున్న ప్రభుత్వ ఆలోచన విధానానికి మీడియా పూర్తి మద్దతు ఇస్తోంది. ప్రజలను క్రికెట్‌లో మునిగిపోయేలా చేయడం ద్వారా వాళ్లు తమ సామాజిక, ఆర్థిక దుస్థితిని మరిచిపోతారు. పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల ఆత్మహత్యలు, ఇండ్లు లేకపోవడం, విద్య, వైద్య సేవలు లేకపోవడం ఇవన్నీ మీడియాకు అప్రధాన విషయాలు. భారతదేశం వరల్డ్ కప్ గెలుస్తుందా? విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ సెంచరీ కొడతారా లాంటి విషయాలే వారికి ముఖ్యమయినవి. భారతీయ మీడియా కొన్ని క్రికెట్ మ్యాచ్‌లను (ఉదాహరణకు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ను) మహాభారత యుద్ధంలా హైప్ చేస్తుంది.
మన మీడియా లో ఎక్కువ స్థలం చిల్లర రాజకీయాలు, సినీనటుల వ్యక్తిగత జీవితాలు, బాబాలు, చిల్లర నేరాలు, స్టాక్ మార్కెట్, క్రికెట్, జ్యోతిష్యం వంటి విషయాలకు కేటాయించబడుతుంది. కానీ పేదరికం, పిల్లల పోషకాహార లోపం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆరోగ్యం, విద్య వంటి సామాజిక అంశాలకు చాలా తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. చాలామంది మీడియా ప్రతినిధులు రాజకీయ సభలు, సినీనటుల ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలు, పాప్ మ్యూజిక్ వంటి కార్యక్రమాలకు హాజరవుతారు. కానీ కార్మికులు, రైతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు, సెక్స్ వర్కర్లు వంటి వారి జీవితాలను, సమస్యలను కవర్ చేసే వారు చాలా కొద్ది మంది మాత్రమే. అందుకే ప్రధాన మీడియా సంస్థలకు ఇది నా సందేశం…
“ఇలాగే కొనసాగించండి! మీరు పొందుతున్న అత్యధిక వేతనాలకు నిజంగా న్యాయంగా చేకూరుస్తున్నారు. మీ యజమానుల కోసం గొప్ప సేవ చేస్తున్నారు. భారతదేశంలో ఆకలితో అలమటిస్తున్న కోట్లాది మహిళల కన్నా కరీనా కపూర్ ఏం తిన్నది అన్నదే మీకు ముఖ్యమైన విషయం.
శబాష్!”
జస్టిస్ మార్కండేయ కట్జూ.
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
(తెలుగు అనువాదం ఇప్ప పృథ్వి రెడ్డి).





