మీడియా అకాడమీ సేవలు అభినందనీయం

– జ‌ర్న‌లిస్టుల‌పై మోనోగ్రాఫ్‌లు స్ఫూర్తిదాయ‌కం
– మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 4: మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా తామున్న‌మాన్న‌ భరోసా ఇచ్చి వారికి ఆర్థిక సహాయం అందజేస్తున్న తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమం అభినందనీయమ‌ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని మీడియా అకాడమి ఆడిటోరియంలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు బుధవారం చెక్కుల పంపిణీ, అకాడమి ప్రచురించిన చిరు పుస్తకాలు (మోనోగ్రాఫ్స్) ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుతో కలిసి గుత్తా సుఖేందర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ అక్షరమే ఆయుధంగా క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులు అకాల మృతిచెందడం బాధాకరమన్నారు. ఆ జర్నలిస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి ఆర్థిక సహాయంగా రూ.లక్ష మంజూరు చేయడంతోపాటు అయిదు సంవత్సరాల పాటు పెన్షన్ సదుపాయం కల్పించడం మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు తోడ్పడుతుందన్నారు. అదేవిధంగా పాత్రికేయ రంగంలో అనేక సంవత్సరాలు సేవలందించిన ప్రముఖ జర్నలిస్టు జీవిత విశేషాలు తెలిపే చిరు పుస్తకాలు (మోనోగ్రాఫ్స్) ఆవిష్కరించడం వలన రాబోయే తరాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. నేటి సమాజంలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఎన్ని మార్పులు వచ్చినా తాను మాత్రం పత్రికలు చదివితినే సంతృప్తి చేందుతానన్నారు. కేశవరావు మాట్లాడుతూ ప్రముఖుల చరిత్ర తెలిపే పుస్తకం చదవడం సులభం. కాని అదే చరిత్ర ను మోనోగ్రాఫ్ గా అందించడం మాటలు కాదు. అది అక్షర రూపం దాల్చడంలో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సమాజానికి అద్దం పట్టేది వార్త అయితే ఆ వార్త వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసిన జర్నలిస్ట్ భవిష్యత్తు తరాలకు దారి చూపిన వారవుతారు. సోషల్ మీడియా ను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదన్నారు. కానీ దీనిపై జర్నలిస్టులందరూ ఎకతాటిపై వచ్చి చర్చించడం లేదా వర్క్ షాప్ లు నిర్వహించి కొంత మార్పుకు నాంది పలకాలన్నారు. మీడియా అకాడమి చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చనిపోయిన 18మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ, ప్రమాదానికి గురైన జర్నలిస్టుకు రూ.50 వేల ఆర్థిక సహాయం చెక్కును అందజేసినట్లు వివరించారు. ప్రముఖ పాత్రికేయులైన అబిద్ అలీఖాన్, డి.సీతారాం, బేతనబొట్ల నాగేశ్వరరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఎం.ఎస్.ఆచార్య, ఎ.బి.కె. ప్రసాద్, జి.ఎస్.వరదాచారి, సి.రాఘవాచారి, వి.హనుమంతరావు, ఆదిరాజు వెంకటేశ్వరరావులపై మీడియా అకాడమి ప్రచురించిన 10 చిరుపుస్తకాలు (మోనోగ్రాఫ్స్) ఆవిష్కరించిన‌ట్టు ఆయన వివరించారు. కార్యక్రమంలో మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, సీనియర్ జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *