– మేడ్చల్ కలెక్టరేట్ లో “దిశ” కమిటీ సమావేశం
– అధికారులు చేసే పనుల ద్వారా వ్యవస్థ పై ప్రజలకు విశ్వాసం కలగాలి
– ఎం పి ఈటల రాజేందర్
మేడ్చల్, ప్రజాతంత్ర, జూలై 18: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలుపరుస్తూ బలహీనవర్గాల ప్రజలకు చేయూతనందిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ జిల్లాను అభివృద్ధి దిశగా పయనింపచేసేందుకు తరచూ సమావేశమవ్వాలని మల్కాజిగిరి ఎంపీ, జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీ చైైర్మన్ ఈటల రాజేందర్ అధికారులకు సూచించారు. మేడల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన ‘దిశ’ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కమిటీ సభ్యులుగా, మెంబరు సెక్రటరీగా జిల్లా కలెక్టరు మనుచౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు పురోగతిని సమీక్షించారు. జిల్లాలో సంక్షేమ శాఖలు పథకాల లబ్దిదారుల ఎంపికలో పారద్శకత పాటించాలన్నారు. అధికారులు చేసే పనుల ద్వారా వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలగాలన్నారు. ఎక్కువగా పరిష్కారం కాని సమస్యలపై దృష్టి కేంద్రీకరించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అనే వ్యత్యాసం చూపకుండా ప్రజలకు సత్ఫలితాలు చేకూరేలా చూడాలన్నారు. జిల్లాలోని జవహర్ నగర్, బాలాజీ నగర్‌లలో డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాలలో తాగునీరు, విద్యుత్తు, రోడ్లు, రవాణ, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కొరత ఉన్నదని, అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈటల కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల దగ్గర ఒక అంగన్‌వాడీ సెంటర్, వైద్య సదుపాయం కల్పించాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో గ్రామీణ పేదలకు 17911 జాబ్ కార్డులు అందించి 19322 మందికి రూ.10.89 లక్షల వేతనాలు అందించామని డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పిడి కాంతమ్మ వివరించారు. ఈ శాఖ తరపున ఇతర కార్యక్రమాల అమలు గురించి కూడా వివరించారు. సమగ్ర శిక్షా అభియాణ్ పథకం జిల్లాలో అమలు జరుగుతున్న తీరును జిల్లా విద్యాశాఖాధాకారి తెలిపారు. జిల్లాలోని వివిధ శాఖల పథకాల పురోగతి వివరాలు తెలిపిన అనంతరం ఛైర్మన్ వారి శాఖలకు సంబంధించి సలహాలు సూచనలు అందజేస్తూ ఎలాంటి సమస్యలు ఉన్నా కలెక్టరు ద్వారా తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైన నిధులు, పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి పేదవారికి లబ్ది చేకూర్చేందుకు జిల్లా యంత్రాంగం అన్ని వేళలా కృషిచేయాలని, అందుకు పూర్తి సహకారం అందిస్తామని రాజేందర్ తెలిపారు. ఎమ్మెల్యే బండారి మాట్లాడుతూ నియోజకవర్గానికి వంద పడకల హాస్పిటల్, డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయింపు, మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లింపు వంటి సమస్యల పరిష్కారాన్ని కోరారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యలను చైర్మన్, కలెక్టరు దృష్టికి తెస్తూ తగిన సలహాలను సూచనలు ఇచ్చారు. ప్రజా ప్రతినిధుల సలహాలను, సూచనలను తప్పక పరిగణనలోకి తీసుకుంటామని కలెక్టరు మనుచౌదరి తెలిపారు. సమావేశంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.





