గిరిజన సంస్కృతి ప్రకారమే మేడారం ఆధునికీకరణ

– మంత్రులు పొంగులేటి, సురేఖ, సీతక్క, లక్ష్మణ్‌కుమార్‌
– ప్రాంగణం మూలస్వరూపంలో మార్పులు చేయడంలేదు: సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: ఆసియా ఖండంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు, వారి మనోభావాలకు అనుగుణంగా ఆధునికీకరణ చేపడుతున్నామని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచనల మేరకు ఆధునికీకరణకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌పై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్పీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, మహబూబాబాద్‌ ఎంపీ బలరామ్‌ నాయక్‌తో కలిసి సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి శుక్రవారం సమీక్షించారు. మాస్టర్‌ ప్లాన్‌కు ముఖ్యమంత్రి తుది ఆమోదం తెలిపిన తరువాత తక్షణమే పనులు ప్రారంభించి వంద రోజుల్లో పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు మంత్రులు సూచించారు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చేపట్టే పనుల్లో గిరిజనుల సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉండాలని, ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాస్టర్‌ ప్లాన్‌ను ముఖ్యమంత్రి ఇప్పటికే పరిశీలించారని, వచ్చే వారంలో ఆయన స్వయంగా క్షేత్రస్ధాయి పరిశీలనకు వస్తున్నందున తగు ప్రణాళికలు, సమాచారంతో సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మూల స్వరూపంలో మార్పులు చేయడం లేదు: సీతక్క

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ఆవరణలో స్వల్ప మార్పులు చేస్తున్నామని, ప్రాంగణ మూల స్వరూపంలో ఎలాంటి మార్పులు చేయడంలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పూజారుల కోరిక మేరకు భక్తులందరూ సులభంగా దర్శించుకునేందుకు సమ్మక్క-సారలమ్మ గద్దెల వరుస క్రమంలోనే పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆదివాసీ కోయ ఆచార సంప్రదాయాలు, కట్టుబాట్లకు అనుగుణంగానే ఆధునికీకరణ పనులు చేపడతామన్నారు. మేడారంలో తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా ద్వారాలను విస్తరిస్తున్నామని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *