– మేడారం మహా జాతర ఏర్పాట్లు ముమ్మరం
– సంప్రదాయ గిరిజన పద్దతిలో పూజల నిర్వహణ
– కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క, అధికారులు
ములుగు, డిసెంబర్ 24: మేడారం మహా జాతర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. వీరిద్దరి గ్దదెలను సమ్మక్క సారలమ్మ గ్దదెల వరుసలోకి మార్చారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గోవిందరాజును బుధవారం ఉదయం 6 గంటలకు, పగిడిద్దరాజును 9.45 గంటలకు పూజారులు ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జాతర కార్యనిర్వహణాధికారి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను గద్దెల ప్రాంగణంలోకి రానివ్వకుండా భద్రత ఏర్పాట్లు చేపట్టారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు కుటుంబాలతో హాజరై పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఏర్పాటు ద్వారా భక్తులంతా ఒక వరుసలో దర్శనానికి వెళ్లేందుకు వీలు కలగనుంది. మేడారం జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. దీనికి కోటి మందికిపైగా భక్తులు తరలి వస్తారని అంచనా. జాతర ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్ఠంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నారు. 46 పిల్లర్లతో 271 చదరపు విూటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండనుంది. దాని మధ్య 40 అడుగుల వెడల్పుతో మూడు, 30 అడుగుల వెడల్పుతో ఐదు స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్దదెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పు ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. వృత్తాకారంలో ఉండే గ్దదెల చుట్టూ 8 స్తంభాలు ఉంటాయి. వాటి మధ్యలో వెదురు బొంగులతో డెకరేషన్ చేస్తారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




