– రూ.200 కోట్లతో మేడారం ఆధునికీకరణ
– 200 సంవత్సరాలు నిలిచేలా రాతి కట్టడాలు
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5ః గిరిజన, గిరిజనేతరుల ఆరాధ్య దైవాలైన సమ్మక, సారలమ్మ జాతర కు సంబంధించి రూ.200 కోట్లకు పైగా ఖర్చుతో ఆధునికీకరణ పనులు చేపట్టామని, ఇప్పటికి దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శాసనమండలిలో సభ్యులు సోమవారం అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు జరిగే మేడారం జాతర కోసం కుంభమేళాను తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కనీసం 200 సంవత్సరాలకు పైగా నిలిచేలా రాతి కట్టడాలతో ఆధుననికీకరణ పనులు చేపట్టామని వివరించారు. మేడారం చుట్టుపక్కల సుమారు 10 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం చేపట్టామని, ఇప్పటికే ఆధునికీకరణ పనుల కోసం 29 ఎకరాల భూమిని అధికారికంగా సేకరించామని తెలిపారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మరో 63 ఎకరాల భూ సేకరణకు నిర్ణయించామని వెల్లడించారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ఈ మేడారం జాతర, ఏర్పాట్లు, ఆధునికీకరణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తాను, ములుగు నియోజకవర్గ ప్రతినిధి, మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలతో కలిసి పలుమార్లు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇస్తున్నామని తెలిపారు. ఈనెల 18న మేడారంలో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా శాసనసభ, శాసన మండలి సభ్యులను, మంత్రులు, స్పీకర్‌లను ఆహ్వానిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





