పారదర్శకంగానే మేడారం గద్దెల నిర్మాణం

– అవినీతిపై ఆధారాలు ఉంటే చూపాలి
– సెల్‌ఫోన్ కొనుగోళ్లపైనా కువిమర్శలు తగవు
– మంత్రి సీతక్క మరోమారు గట్టిగా జవాబు

ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11:మేడారం సమ్మక్క- సారక్క అమ్మవార్ల గద్దెల పునర్నిర్మాణ పనుల్లో ఎక్కడా అవినీతి జరగలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్దదెల పునర్మిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని అంటున్నారని ఆధారాలు ఉంటే చూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అవసరమైతే సీబీఐ విచారణ జరపాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ములుగులో శనివారం పర్యటించారు. మహేశ్ గౌడ్‌కు గట్టమ్మ దేవాలయం వద్ద మంత్రి సీతక్క, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గట్టమ్మ దేవాలయంలో మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం నుంచి భారీ బైక్ ర్యాలీగా ములుగు పట్టణ కేంద్రానికి నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ తనపై తప్పుడు ప్రచారం చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో తనను ఓడించేందుకు రూ.వందల కోట్లు ఖర్చు చేశారని, తనపై తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనను ప్రలోభాలకు గురిచేశారని, అయినా తాను వారికి లొంగలేదని చెప్పారు. అంగన్‌వాడీ టీచర్లకు ఇచ్చే ఫోన్లలో అవినీతి జరిగిందని, తనను అవినీతి సీతక్క అంటున్నారంటూ జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. తానెక్కడా అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఐదుగురు నిపుణులైన అధికారుల కమిటీ పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా టెండర్లు నిర్వహించామని స్పష్టం చేశారు. రూ.11,650లకు ఫోన్లు కొంటే రూ.14,000 అని ప్రచారం చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం.. చట్టపరమైన చర్యలు తప్పవు.. దమ్ముంటే ఆరోపణలు నిరూపించండంటూ సవాల్ విసిరారు. ములుగులో పోషణ పక్వాడ సందడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేదని, కరెంటు, తాగునీరు లేదు.. మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,500 అంగన్‌వాడీలకు భవనాలే లేకపోయినా నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే మార్పు మొదలైందదన్నారు. ఇప్పటికే రెండు వేల కొత్త అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని చెప్పారు. కేవలం పౌష్టికాహారం అందించడమే కాదు అంగన్‌వాడీలను సకల సౌకర్యాలతో ప్రీ-ప్రైమరీ స్కూల్స్‌గా తీర్చిదిద్దుతుంటే అది ఓర్వలేక కొన్ని పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. విమర్శలు పక్కన పెట్టి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని సీతక్క  స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *