సమ్మక్క-సారక్క జాతర గిరిజనుల మహా కుంభ్‌

– కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం
– ఓరంతో క‌లిసి త‌ల్లుల‌ను ద‌ర్శించుకున్న కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి
– కేంద్ర మంత్రుల‌కు రాష్ట్ర మంత్రుల స్వాగ‌తం

మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: మేడారం సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి గురువారం ఉదయం ప్రత్యేకంగా సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు ఆలయ ప్రధాన ద్వారం వద్ద కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ డోలు-డప్పు వాయిద్య మోతల నడుమ పూజారులు, అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికారు. ఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. అనంతరం తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. తదనంతరం మీడియా సమావేశంలో మంత్రి జువల్ ఓరం మాట్లాడుతూ సమ్మక్క-సారక్క జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఇది గిరిజనుల మహాకుంభ్‌గా నిలుస్తోంది. సుమారు 20 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు మళ్లీ ఈ పవిత్ర జాతరకు రావడం ఆనందంగా ఉంది” అని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు అందిస్తోందని తెలిపారు. జాతర నిర్వహణకు సహకరిస్తూనే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు పాత మిత్రుడని, పార్లమెంటులో కలిసి పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ధర్తీ ఆబా గిరిజన గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద రూ.లక్ష కోట్లు, పీఎం జన్-మన్ యోజన కింద రూ.24,000 కోట్లు, తెలంగాణకు 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో గిరిజన వ్యవహారాల ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటై తొలి కేబినెట్ మంత్రిగా తాను బాధ్యతలు నిర్వర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. భగవాన్ బిర్సా ముండా వంటి గిరిజన వీరుల త్యాగాలను దేశం గౌరవిస్తోందని అన్నారు.

సమ్మక్క-సారక్క పేరుతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం :కిషన్ రెడ్డి

మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ సమ్మక్క-సారక్క జాతర గిరిజన ప్రజల అతిపెద్ద పండుగ. నెల రోజులపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తారు అని తెలిపారు. జాతర ఏర్పాట్లలో భాగస్వాములైన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, బొగత జలపాతం ప్రాంతాల పర్యాటక అభివృద్ధికి రూ.80 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. రామప్ప దేవాలయ అభివృద్ధికి రూ.140 కోట్లు, ఈ ఏడాది జాతర నిర్వహణకు రూ.3.70 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. సమ్మక్క-సారక్క పేరుతో రూ.890 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానున్నదని, పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించుకుంటామని వెల్లడించారు. లక్షలాది మంది వచ్చే ఈ మహాజాతరలో భక్తులకు కనీస వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ, అంకితభావంతో పనిచేస్తున్న అధికారులు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

కాగా, మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వినతిపత్రం అందజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *