– వన ప్రవేశం చేసిన ఆదివాసీ ఆరాధ్య దైవాలు
– పోటెత్తిన జనం
– ఏర్పాట్లలో యంత్రాంగం వైఫల్యం
(మండువ రవీందర్‌రావు)
మూడు రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నాల్గవరోజైన శనివారం సాయంత్రంతో ముగిసింది. సమ్మక్క, సారలమ్మలతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజులను వారి యధాస్థానాలకు తీసుకువెళ్ళడంతో జాతరకు ముగింపు పలికినట్లు అయింది. నాలుగు రోజుల జాతరలో శుక్ర, శనివారాలు తమ ఆరాధ్యదేవతల దర్శనానికి అశేషంగా జనం రావడంతో మేడారం వనమంతా జనసంద్రంగామారింది. ప్రధానంగా సమ్మక్క గద్దెకు చేరుకోవడం ఈ జాతరలోని ప్రధాన ఘట్టం, కాగా సమ్మక్క వన ప్రవేశంకూడా అంతే ఉద్వేగభరితంగా సాగింది. చిలకలగుట్టనుండి సమ్మక్కను గద్దెకు చేర్చిన ప్రధాన పూజారి కొక్కెర క్రిష్ణయ్య తిరిగి అమ్మవారిని శనివారం సాయంత్రం వనానికి చేర్చటంలో కూడా ప్రధాన భూమికను పోషించాడు. ఇతర గిరిజన పూజారులతో కలిసి సమ్మక్క గద్దెకు చేరుకుని కొద్దిసేపు రహస్య పూజాక్రతువును నిర్వహించారు. అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ భరిణను తీసుకుని తిరిగి చిలకలగుట్టకు చేరుకున్నారు. అయితే అమ్మవారి వనప్రవేశంతో జాతర క్రతువు పూర్తి అయినప్పటికీ, మరికొద్ది రోజులవరకు గద్దెపై అమ్మవార్లు ఉన్నట్లుగానే భావించి భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకోవడమన్నది ఆనవాయితీగా వస్తున్నది. వాస్తవానికి ప్రతీ రెండేళ్ళకు ఒకసారి ఈ మహాజాతర జరగనున్నప్పటికీ, భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకోవడమన్నది నిరంతరాయంగా మారింది.
ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం
ప్రతీ జాతరకు గత జాతరకన్నా రెట్టింపు భక్తులు రావడమన్నది సహజంగా జరుగుతున్న ప్రక్రియ. గత జాతరల జనం తాకిడిని దృష్టిలోపెట్టుకుని ఈసారి క్యూలైన్‌లు విస్తరించినప్పటికీ కిక్కిరిసిన జనంతో క్యూలైన్‌లన్నీ నిండిపోయాయి. గద్దెలవద్దకు అశేషంగా భక్తులు తోసుకురావడంతో నిర్వహణ అదుపు తప్పింది. గద్దెల చుట్టూఉన్న ఇనుప గ్రిల్స్‌పైకెక్కి కొందరు భక్తులు దూకడం కనిపించింది. గంటల తరబడి క్యూలైన్ ముందుకు సాగకపోవడంతో ప్రధానద్వారంవద్ద వత్తిడి ఎక్కువ అవడం, ఫలితంగా పోలీసులు లాఠీలకు పనిచెప్పిన ఘటనలు చోటుచేసుకోవడం విచారకరం. భక్తుల వత్తిడి పెరగడంతో విఐపి లైన్‌లోకూడా సాధారణ భక్తులకు కొంతసేపు అనుమతిచ్చి ఆ తర్వాత నిలిపివేయడంకూడా ఇబ్బందికరంగా మారింది. ప్రతీ రెండేళ్ళకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క జాతరకోసం జిల్లా యంత్రాంగం రెండు మూడు నెలల ముందునుండే పనులు ప్రారంభించడమన్నది సహజంగా జరుగుతున్న ప్రక్రియ. అయితే జాతరనాటికి పనులు పూర్తికాకపోవడమన్నదికూడా అంతేసహజంగా జరుగుతూ వస్తున్నది. అందుకు సంబందిత పనులకు నిధులు త్వరగా మంజూరు చేయకపోవడం ఒకటైతే, కాంట్రాక్టర్ల జాప్యం మరోకారణం. కాని ఈ జాతరలో అలాంటి ఇబ్బందులను అధిగమించి జాతరనాటికి అన్నిపనులు పూర్తిచేయాలని రాష్ట్రప్రభుత్వం ఎంత పురమాయించినా గత జాతరకు భిన్నమేమీ జరుగలేదు. ఒకవైపు జాతర జరుగుతున్న క్రమంలోకూడా ఇంకా సివిల్ పనులు కొనసాగుతూనే కనిపించాయి. రాష్ట్ర, జిల్లా యంత్రాంగం ముందస్తుగా చేసుకున్న ప్రణాళికలేవీ సకాలంలో అమలుకాకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించింది. గత జాతరలోపనిచేసిన అనుభమున్న అధికారులు లేకపోవడంకూడా ప్రణాళిక ప్రకారం పనులు జరుగకపోవడానికి కారణమంటున్నారు. జాతరను దృష్టిలోపెట్టుకుని మేడారంలో అభివృద్దికోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈసారి 250 కోట్లరూపాయలను కేటాయించి, పనులను వందరోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. పనులపై పలుమార్లు సమీక్షలు జరిపారు. మంత్రులు సీతక్క, కొండసురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు ఆధికారులు నిత్యం పర్యవేక్షించారు. అయినా మంత్రులమద్య సమన్వయలోపించిందన్న వార్తలు వినవస్తున్నాయి. కాగా మంత్రి సీతక్క అంతా తానై వ్యవహరించింది. ఈ జాతరలో సాంకేతిక వినియోగం చేపట్టారు. ముందస్తు జాగ్రత్తలపై ప్రణాళికలను రచించారు. అయినప్పటికీ గత జాతరలకు బిన్నంగా జరుగలేదన్న వాదన వినిపిస్తున్నది. ప్రధానంగా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేకపోయారు. కిలోమీటర్లమేర ట్రాఫిక్ నిలిచిపోవడం గత జాతరలను తలపించింది. శుక్రవారం ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా కనిపించింది. మేడారం-తాడ్వాయి మార్గంలో అనేక ట్రాఫిక్ అవరోధాలు ఎదురైనాయి. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతే తక్షణ నివారచర్యలకోసం వేసుకున్న పథకాలు ఫలించలేదు. ఫలితంగా మేడారం బస్సు ప్రాంగణం వద్ద, మేడారం-తాడ్వాయి మధ్య భక్తులు ఇబ్బంది పడ్డారు. సుమారు రెండు దశాబ్దాలనాటి ఇబ్బందులే ఇక్కడ పునరావృతం అయినట్లు కనిపించింది. ఈ రెండింటి మద్యఉన్న 13 కిలోమీటర్ల దూరానికి దాదాపు నాలుగు గంటల సమయం తీసుకుందంటే పోలీసులు, అధికార యంత్రాంగం ఎంత సమర్థవంతంగా పనిచేశారో అర్థమవుతున్నది. బస్సులు ముందుకు కదిలేపరిస్థితి లేకపోవడంతో మేడారంలో ఆర్టీసి టికట్‌కౌంటర్‌ను కొంతసేపు మూసివేయాల్సి వచ్చింది. దాంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గంటలకొద్ది ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వారికి మంచినీళ్ళుకూడా లభ్యంకాకపోవడంతో భక్తులు మరింత ఆగ్రహించారు. తమవారు ఎక్కడున్నారో తెలుసుకుందామంటే ఫోన్లు పనిచేయని పరిస్థితి ఏర్పడిందని కొందరు భక్తులు వాపోయారు.
పాస్‌లు ఉన్నా..
వివిఐపి, విఐపి, ప్రెస్ పాసులున్నా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇటువైపు వెళితే అటువైపు అని, అటు వెళితే ఇటు అని ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలున్నాయి. జాతర కవరేజ్ చేసే మీడియా మిత్రులను కూడా కట్టడి చేయడంతో ఎటూ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. కవరేజీలో భాగంగా బైటకు వెళితే మళ్లీ లోపలకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ మీడియా మిత్రులు వాపోయారు. ఒకవైపు అమ్మవార్ల దర్శనానికి భక్తులు ఇబ్బందులు ఎదుర్కుంటుంటే పోలీసులు, భద్రతా సిబ్బంది, అధికారులు విఐపిల సేవలో నిమగ్నమవడంకూడా ఇబ్బందికి దారితీసింది. వివిఐపిలు రావడంతో పోలీసుల హడావిడి ఎక్కువైంది. దీంతో పలుమార్లు పోలీసులు ప్రజలను నియంత్రించడంలో లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దె చేరడం, శుక్రవారం నలుగురు వనదేవతలు కొలువై ఉండడంతో ఒకేసారి వారి దర్శనం చేసుకునే ప్రముఖుల తాకిడి ఎక్కువైంది. గవర్నర్ జిష్టుదేవ్‌వర్మ, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషన్ గ్యారత్ విన్ ఓవెన్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, డిజీపి శివధర్‌రెడ్డి, జైళ్ళ శాఖ డీజీ సౌమ్య మిశ్రా, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, పలువురు ఎంఎల్‌ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలు, రాష్ట్రానికి చెందిన మంత్రులు, మాజీ మంత్రులు పలువురు విచ్చేయడంతో వారికి భద్రత కలిగించేందుకు సిబ్బంది ఇబ్బందిపడ్డారు.
——————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.