నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలి

– త్వరలో మేడారం రానున్న సీఎం రేవంత్‌ రెడ్డి
– రూ.150 కోట్లతో భక్తులకు సౌకర్యాలు
– మంత్రి ధనసరి అనసూయ సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: వచ్చే సంవత్సరం జనవరిలో జరగనున్న మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని భక్తులకు సౌకర్యాల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, వారంలోగా ఆయన మేడారంలో పర్యటిస్తారని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. జిల్లాలోని ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న విఐపి పార్కింగ్‌ రోడ్డు, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌, హరిత హోటల్‌ తదితర ప్రాంతాలను జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్‌, ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోతు రవిచంద్రలతో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం మేడారంలోని ఐటీడీఏ సమావేశపు హాల్లో అమ్మవార్ల పూజారులు, అన్ని శాఖల అధికారులతో మహా జాతరపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.150 కోట్లు కేటాయించిందని, ఆ నిధులతో ఆయా శాఖల అధికారులు వంద రోజుల నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గద్దెల ప్రాంతంలో పూజారుల మనోభావాలు దెబ్బతినకుండా వారి సూచనల మేరకు నూతన హంగులతో శ్వాశతంగా నిలిచిపోయేలా పనులు చేయాలని, మేడారం గ్రామస్తులు, పూజారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జాతరకు సామాన్య పౌరుని నుండి రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ముఖ్యులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వివిఐపిలకు ఇబ్బందులు కలగకుండా విమానాలు సైతం దిగే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పనులు శాశ్వతంగా ఉండే విధంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మహా జాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సమావేశంలో ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ స్తపతి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఇ.శివనాగిరెడ్డి, అదనపు కలెక్టర్‌ రెవెన్యూ సిహెచ్‌.మహేందర్‌జి, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, ఈఓ వీరస్వామి, ఆర్కిటెక్చర్‌, ఇంజనీరింగ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *