- క్రీడాభివృద్ధి కోసం క్షేత్రస్థాయి పర్యటనలు
- క్రీడా శాఖపై మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 5: క్రీడలను శిఖరస్థాయికి చేర్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు క్రీడా శాఖ పనితనంలో కొత్తదనం కనిపించాలని యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సచివాలయంలోని తన చాంబర్లో క్రీడా శాఖపై స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో జరిగిన వైఫల్యాలను, అలసత్వాన్ని పక్కనపెట్టి నూతన వొరవడితో క్రీడా శాఖ పనిదానంలో కొత్తదనం కనిపించాలని, సీఎం రేవంత్ ఆలోచనల మేరకు క్రీడా శాఖ పనితనం ఉన్నత స్థాయిలో ఉండాలని సూచించారు.
2036 ఒలంపిక్స్‌లో పతకాలు లక్ష్యంగా క్రీడా శాఖ పనిచేయాలని, చిత్తశుద్ధితో పనిచేస్తే లక్ష్యాన్ని సాధించడం సులభతరమేనని అన్నారు. క్రీడారంగంలో సమూల మార్పులు కార్యాలయాల్లో కూర్చుంటే సాధ్యం కావంటూ కార్యక్షేత్రంలోకి వెళ్లాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్రీడా కార్యక్రమాల విజయవంతం కోసం క్రీడా శాఖ పని తీరు మెరుగుదల కోసం క్షేత్రస్థాయిలో తాను పర్యటిస్తాన అదిలాబాద్ కరీంనగర్‌తోపాటు ప్రతి అకాడమీని సందర్శించి విద్యార్థులు, కోచ్‌లతో, విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చిస్తామని మంత్రి తెలిపారు. అలాగే క్రీడాభివృద్ధికి క్రీడారంగ నిపుణులతో చర్చిస్తామని, వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తామని,
త్వరలో అందరితో విడివిడిగా సమావేశమవుతానని చెప్పారు. క్రీడాభివ`ద్ధికి క్రీడల శాఖ కృషి ఒక్కటే సరిపోదని, పాఠశాల విద్యాశాఖతో సమన్వయం చేసుకొని పాఠశాల స్థాయి నుండే క్రీడాకారులను గుర్తించాలని, గురుకుల విద్యాలయాల్లో ఉన్న ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో యువజన అభివృద్ధి, పర్యాటక, క్రీడలు ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి, స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు, ఇంజనీరింగ్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు





