Medals: ప‌త‌కాల సాధ‌న‌పై దృష్టి పెట్టాలి

-ప్ర‌తిభ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జ‌ర‌గాలి
-స్కూళ్ల‌లో సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేయాలి
– మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి 

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 8:  తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు, అకాడమీలు  పతకాలు సాధించే కర్మగారాలుగా మారాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు.  శుక్ర‌వారం ఎల్బీ స్టేడియంలో చైర్మన్ శివసేనారెడ్డి తో కలిసి ఆయనరాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లు, అకాడమీల పనితీరు, సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరానికి పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరగాలని హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్ స్కూళ్లలో ఆధునిక క్రీడా శిక్షణ, విద్యలో మెరుగుదల సాధించాలని అధికారులకు సూచించారు.హకీంపేట్‌లో తక్షణ మరమ్మతులు, అన్ని స్కూళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.  స్పోర్ట్స్ అథారిటీ అకాడమీల పనితీరు మెరుగుపరిచి విద్యార్థి క్రీడాకారుల్లో స్ఫూర్తిని కలిగించే కార్యక్రమం నిర్వహించాలని కోరారు.
స్పోర్ట్స్ స్కూల్లో అకాడమీలలో త్రైమాసికంగా బ్యాటరీ టెస్టులు నిర్వహించి , కంప్యూటరైజ్డ్ రిపోర్టులు తయారుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపించే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థుల వర్గీకరణ (ఏ-ఎఫ్‌) చేసి  క్రీడా ప్రతిభ లేని వారిని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లకు బదిలీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.  స్పోర్ట్స్ స్కూల్లో పనిచేసే అధికారులు సిబ్బంది కోర్సులు అందరూ విద్యార్థుల సంక్షేమం కోసం  తమ పిల్లలుగా చూసుకోవాలని వారికి ఇబ్బందులు రాకుండా వారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరారు.   ప్రేరణాత్మక తరగతులు, వ్యక్తిత్వ వికాస అంశాల్లో శిక్షణ యోగ శిక్షణ తప్పనిసరి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.  తెలంగాణ విద్యార్థిని విద్యార్థులు సాధించిన విజయాలను ప్రదర్శించేందుకు ప్రతి స్పోర్ట్స్ స్కూల్ అకాడమీల్లో విద్యార్థుల తల్లిదండ్రుల కొరకు విజిటర్స్ హాల్స్ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఎల్.బి. స్టేడియంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం చేసి అన్ని అకాడమీలను స్పోర్ట్స్ స్కూల్ లలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను ఈ కాన్ఫరెన్స్ వాళ్లకు అనుసంధానిం చాలని తెలిపారు.  క్రమం తప్పకుండా క్రీడా శాఖలోని అన్ని విభాగాలపై నిరంతరం సమీక్షలు చేస్తామని తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్లో అకాడమీల పనితీరు మెరుగుపరచడమే కాకుండా అన్ని అంశాలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకుంటూ సమగ్ర క్రీడాభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు.  విధుల్లో అలసత్వం వహించే ఎవరిని కూడా ఉపేక్షించమని మంత్రి శ్రీహరి తెలిపారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్  కె. శివసేన రెడ్డి, తో పాటు హకింపేట స్పోర్ట్స్ స్కూల్  ప్రత్యేక అధికారి  టి. మమత, డిప్యూటీ డైరెక్టర్లు జి చంద్ర రెడ్డి జి. రవీందర్, డా. రవి శంకర్ పల్లెల,  ఎస్.ఎం. బాషా, జి. అశోక్ కుమార్, పి. సందీప్ కుమార్, సురేష్ కాలేరు తదితరులు ఈ సమీక్ష సమావేశంలో  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *