– గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్న కాంగ్రెస్
- దేశ ప్రయోజనాలకు భిన్నంగా ఆ పార్టీ వైఖరి
– అసోం ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు
గౌహతి, మార్చి 14: మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రభావం దేశంపై సాధ్యమైనంత తక్కువగా ఉండేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. అయితే ఇందుకు భిన్నంగా ఏమాత్రం బాధ్యతలేని విపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని సిల్చార్‌లో శనివారంనాడు పర్యటించారు. రూ.23,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.22,864 కోట్లతో సిల్చార్-మేఘాలయలోని షిల్లాంగ్ మధ్య నిర్మించనున్న యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, అస్సాం ప్రజలను హింస, ఉగ్రవాదం వైపు కాంగ్రెస్ తప్పుదారి పట్టించిందని, ఇవాళ రాష్ట్రంలో సమృద్ధిగా అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. దేశ ప్రజలపై ఆ ప్రభావం తగ్గించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. వారి రక్షణ, శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతాయుత ప్రతిపక్షంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని ఆశిస్తాం. అయితే దేశ ప్రయోజనాల పరిరక్షణలో కాంగ్రెస్ మరోసారి విఫలమైందని విమర్శించారు. దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. మోదీని దూషించడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయంగా భారత్ శీఘ్ర అభివృద్ధిని సాధించడం కొన్ని శక్తులకు ఇష్టంలేదు. అలాంటి శక్తుల చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారిందని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కి అస్సాం గురించి కానీ, దేశం గురించి కానీ ఎలాంటి విజన్ లేదని తప్పుపట్టారు. మోదీని దూషించడం, అబద్దాలు, వదంతుల ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించడమే ఆ పార్టీకి తెలుసునన్నారు. బీజేపీ ప్రభుత్వం యువతకు అనేక అవకాశాలు కల్పించిందన్నారు. కాంగ్రెస్ ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయో, అక్కడి నుంచే తమ పని ప్రారంభమవుతుందని, అభివృద్ధిలో వెనుకబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వడమే బీజేపీ ప్రధాన మంత్రమని చెప్పారు. మీరు కాంగ్రెస్‌ను ఇక్కడినుంచి ఎప్పుడో తరిమికొట్టారని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లోనూ ప్రతి రాష్ట్రం ఆ పార్టీకి గుణపాఠం చెప్పనుందన్నారు. ఇటీవల దిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసనలు తెలపడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మొత్తం దేశం ఈ చర్యను ఖండించిందన్నారు. ఓటమితో నిరాశ చెందిన కాంగ్రెస్ దేశంపైనే దాడికి దిగిందన్నారు. నిరాశతో దుస్తులు చింపుకోవడం తప్ప వాళ్లకి మరేమి మిగల్లేదని ఎద్దేవా చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



