ఎస్‌ఐఆర్‌పై రాహుల్‌వి అర్థం లేని ఆరోపణలు

– పదేపదే అబద్ధాలు వల్లె వేస్తే అవి నిజాలు కావు
– రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ధ్వజం

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై లోక్‌ సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడిన మాటలు హాస్యాస్పదమని, ఆయన మాటలతో వారికి ఎన్నికల వ్యవస్థపై కనీస అవగాహన లేదనేది మరోసారి నిరూపితమైందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సంస్కరించేందుకు ఎస్‌ఐఆర్‌ అవసరమనే విషయం రాహుల్‌ ముందుగా తెలుసుకోవాలన్నారు. బీహార్‌ ఎన్నికల్లో ఎస్‌ఐఆర్‌ వల్ల బీజేపీ కానీ, ఎన్డీయే కానీ లబ్ధి పొందలేదని ఎన్నికల విశ్లేషకులు బల్లగుద్ది చెప్పినా రాహుల్‌ గాంధీ అబద్ధాలను పదేపదే వల్లె వేస్తున్నారని, అబద్ధాలను ఎన్నిసార్లు చెప్పినా అది అబద్ధమే అవుతుందని అన్నారు. ఒక దిక్కు ఓటరు లిస్టు తప్పులతడకగా ఉందని ఎన్నికల కమిషన్‌ను విమర్శిస్తూ తప్పులను సరిదిద్దేందుకు ఓటర్ల జాబితా సర్వే నిర్వహిస్తే విమర్శించడం ఆయన రెండు నాల్కల ధోరణికి, వితండవాదానికి, అవగాహనారాహిత్యానికి అద్దం పడుతోందన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి ఎంపిక ప్రక్రియ నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తొలగించారని ఆయన ప్రశ్నిస్తున్నారంటూ సీఈసీ ఎంపిక పక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎప్పుడూ భాగం కాదు. అసలు సోనియా గాంధీ చెప్పుచేతల్లో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడే ఏకపక్షంగా సీఈసీని ఎంచుకునేవారు.. ఇప్పుడు ఆ ఎంపిక ప్రక్రియలో ప్రతిపక్ష నేత అంటే మీరు కూడా సభ్యుడిగా ఉన్న కమిటీ ఎంపిక చేస్తోంది.. ఇదంతా మీకు మీ టీం చెప్పలేదా అని నిలదీశారు.

ఎన్నిక జరిగిన 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజీని ధ్వంసం చేసేందుకు ఎన్నికల కమిషన్‌కు ఎందుకు అనుమతి ఇచ్చారని రాహుల్‌ ప్రశ్నిస్తున్నారంటూ ఈ ప్రశ్నతో ఆయన అమాయకత్వానికి జాలేస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నిక జరిగిన తర్వాత ఏవైనా వివాదాలు, ఫిర్యాదులుంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇచ్చిన గడువు 45 రోజులేనన్నారు. పదవిలో ఉండగా సీఈసీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారంటూ ఆయనపై మీలాంటి వాళ్లు లేనిపోని ఆరోపణలు చేసి, వారి విధులకు ఆటంకం కలిగించడమే కాక వారిని ఇబ్బందులకు గురిచేస్తారనే ఉద్దేశంతో వారికి మన పెద్దలు చట్టంలో కొన్ని వెసులుబాట్లు కల్పించారని ఆయన సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌ హయాంలోనే ఈ చట్టాన్ని తెచ్చారన్నారు. ఒకవేళ సీఈసీ నిజంగా తప్పు చేస్తే జడ్జీల్లాగే వారిపై చర్యలు తీసుకునే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు. ఊరికే రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని తిరగడం కాదు.. దాన్ని ఓసారి తిరగేయండి.. చదవండి.. నేర్చుకోండి.. మీకే తెలుస్తుంది అని హితవు పలికారు. హరియాణాలో తప్పు జరిగిందని గొంతు చించుకుంటున్న రాహుల్‌ గాంధీకి తాను చేస్తున్న ఆరోపణలు నిజం కావని ఎప్పుడో తేలిపోయిందనే విషయం తెలియదా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బ్రెజిల్‌ మోడల్‌ ఫొటో ఓటర్ల జాబితాలో ఉందని పెద్దపెద్ద స్క్రీన్లు పెట్టి మరీ రచ్చ చేశారు.. అలాంటిది ఏదీ లేదని కూడా తేలిందన్నారు. ఈవీఎంలలో ఏమీ తప్పు జరగట్లేదని గ్రహించి ఓట్‌ చోరీ అని కొత్త పల్లవితో అనవసరంగా హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో లోపాలను దాచేందుకు, కాంగ్రెస్‌పై ఉన్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే ఎన్నికల కమిషన్‌పై పడి ఏడుస్తున్నారన్నారు. మీ పార్టీ అసమర్థతకు గల కారణాలను తెలుసుకొని, ఎన్నికల కమిషన్‌ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలపై దుష్ప్రచారం చేయడం మానుకోండని హితవు పలికారు. ఇలాగే వ్యవహరిస్తామంటే మిమ్మల్ని, మీ పార్టీని మరింతగా తిరస్కరిస్తారనే విషయాన్ని తెలుసుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *