– తొలిసారి కమల వికాసం
– మాట నిలబెట్టుకున్న బండి సంజయ్
– సమష్టి కృషితోనే సాధ్యమైంది
– కేంద్ర మంత్రి వెల్లడి
కరీంనగర్తి/తిమ్మాపూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న మాట నిలబెట్టుకున్నారు. అద్భుతమైన వ్యూహంతో కరీంనగర్ కార్పొరేషన్‌పై తొలిసారి కాషాయ జెండా రెపరెపలు సాధ్యం చేశారు. కార్పొరేషన్ లో 66 డివిజన్లు ఉండగా 30 డివిజన్లలో బిజెపి గెలుపొందింది. కాంగ్రెస్ 12 డివిజన్లలో, బిఆర్ఎస్ 9, ఎంఐఎం 3 డివిజన్లు, ఏఐఎఫ్‌బి రెండు, స్వతంత్రులు పది డివిజన్లలో గెలుపొందారు. స్వతంత్రులు పదిమందిలోని ఐదుగురు సభ్యుల మద్దతుతో కార్పొరేషన్ లో మొట్టమొదటిసారిగా పాగా వేసింది. మేయర్ అభ్యర్ధిగా 2వ డివిజన్ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ పేరును బీజేపీ ఖరారు చేసింది. డిప్యూటీ మేయర్‌గా మాజీ మేయర్ సునీల్‌రావును ఎంపిక చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు వారి పేర్లను ఖరారు చేశారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బీజేపీ కార్పొరేటర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జిల్లా ఇన్‌చార్జి డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డికి లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు ఆంటోనీ రెడ్డి వారి పేర్లున్న సీల్డ్ కవర్‌ను అందజేశారు. కార్పొరేటర్ల సమక్షంలో డాక్టర్ మనోహర్ రెడ్డి హైకమాండ్ ఆ కవర్‌లోని పేర్లను కార్పొరేటర్లకు తెలియజేసి అభిప్రాయాలు చెప్పాలని కోరారు. మేయర్ అభ్యర్ధిగా కొలగాని పేరును 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేశ్ ప్రతిపాదించగా, 62వ డివిజన్ కార్పొరేటర్ పెద్దపల్లి శ్రీలేఖ బలపర్చారు. డిప్యూటీ మేయర్ అభ్యర్ధిగా సునీల్ రావు పేరును 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ ప్రతిపాదించగా 51వ డివిజన్ కార్పొరేటర్ భండారి వేణు బలపర్చారు. పార్టీ సీనియర్ కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, వాసాల రమేశ్ సహా బీజేపీ కార్పొరేటర్లు శ్రీనివాస్, సునీల్‌రావు పేర్లను మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్ధులుగా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు చప్పట్లతో తమ ఆమోదం తెలిపారు. అక్కడినుండి నేరుగా ప్రత్యేక బస్సులో కార్పొరేషన్‌కు చేరుకున్నారు.
వడబోసిన హైకమాండ్
మేయర్ పదవిపై బీసీ కార్పొరేటర్లంతా ఆశలు పెట్టుకున్నారు. దీన్ని దష్టిలో ఉంచుకున్న జిల్లా నాయకత్వం బీసీ, జనరల్ స్థానాల్లో గెలుపొందిన బీసీ కార్పొరేటర్ల పేర్లను, వారి బయోడేటాను రాష్ట్ర నాయకత్వానికి పంపింది. ఆ జాబితాలో ఉన్న ఒక్కో కార్పొరేటర్ పేరును, పార్టీకి చేసిన సేవలు, ప్రజల్లో ఉన్న పేరును పరిశీలించింది. చివరకు ఏబీవీపీ నుండి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదిగిన సామాన్య కార్యకర్త కొలగాని పేరును ఖరారు చేసింది. మేయర్ పదవి తనను వరిస్తుందని కొలగాని ఊహించలేదు. ఈ ఉదయం బీజేపీ కార్పొరేటర్ల సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి గంగిడి మనోహర్ రెడ్డి కొలగానిని మేయర్ అభ్యర్ధిగా రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసిందని తెలియజేయడంతో అయన ఆశ్చర్యానికి లోనయ్యారు. కార్పొరేటర్లంతా అభినందనలు తెలియజేస్తున్న సమయంలోనూ ఆశ్చర్యం, ఆనందంతోపాటు ఆనందంతో చెమర్చిన కళ్లతో అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సామాన్య కార్యకర్తనైన తాను మేయర్ పదవికి ఎంపికవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. కష్టపడి, విధేయతతో పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయనే దానికి తానే నిదర్శనం అని చెప్పారు.
ఆర్‌ఎస్ఎస్, ఏబీవీపీలతో కొలగాని ప్రస్థానం
కొలగాని 1989 జూన్ కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలో జన్మించారు. ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ చేసిన ఆయన చిన్నప్పటినుండే ఆర్‌ఎస్ఎస్ లో చురుకుగా పాల్గొనేవారు. 2013లోనే ప్రాథమిక శిక్షను పూర్తి చేశారు. చిన్ననాటి నుంచే స్వామి వివేకానంద ఆలోచనలతో ప్రభావితమై ఎన్‌ఎస్ఎస్, ఎన్‌వైపీ, ఏక్తా పరిషత్ సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్ధి దశ నుండే రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది. 2005 నుండి 2007 వరకు ఏబీవీపీలో పనిచేసి విద్యార్ధుల సమస్యలపై పోరాడారు. 2007 నుండి 2009 వరకు యువ మోర్చాలో పనిచేసి యువజన పోరాటాల్లో పాలుపంచుకున్నారు. 2007 నుండి 2009 వరకు ఎన్‌ఎస్ఎస్ వలంటీర్‌గా పనిచేసి 2010లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ వలంటీర్ అవార్డును అందుకున్నారు. నేషనల్ యూత్ ప్రాజెక్టులో చేరి దేశ సేవకు అంకితం కావాలని భావించిన కొలగాని 2009లో అసోంలో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ పీస్ క్యాంప్‌నకు హాజరయ్యారు. లక్షద్వీప్, బెంగళూరు, యూపీ, రాజస్తాన్, ఉత్తరాఖండ్, హర్యానా, అండమాన్ నికోబార్‌లలో నిర్వహించిన అనేక జాతీయస్థాయి శిబిరాల్లోనూ పాల్గొన్నారు. యువత, పిల్లలతోపాటు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. 15 సార్లు రక్తదానం చేశారు. 2009 నుండి 2013లో ఏక్తా పరిషత్ కార్యక్రమాల్లో పాల్గొని ఆదివాసీల హక్కుల కోసం పోరాడారు. 2005లో భాయీజీ సేవా పురస్కార్, 2010లో ఎన్‌ఎస్ఎస్ఉత్తమ వలంటీర్, 2021 కరోనా కాలంలో అందించిన సేవలకు కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ కట్టర్ చేతుల మీదుగా రక్షక్ అవార్డులను అందుకున్నారు. ఇక రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే 2014 నుండి 2019 వరకు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2020 నుండి 2025 వరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్‌గా కొనసాగారు. 2021లో కరోనా వ్యాక్సిన్ జిల్లా కన్వీనర్‌గా, 2023 నుండి 2024 వరకు కరీంనగర్ టౌన్-1 కన్వీనర్‌గా, 2024లో నిఫా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2025లో చొప్పదండి మండల సర్పంచ్ ఎన్నికల ఇన్‌చార్జిగా పనిచేశారు. నిన్నటి మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





