– కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలి
– పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16ః జీహెచ్ఎంసీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేయర్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకోసం కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని, స్థానిక సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని, మార్పులకనుగుణంగా మనమూ మారుతూ ప్రజలను మన వైపు వచ్చేలా పనిచేయాలని సూచించారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, పంచాయతీ ఎన్నికల్లో ఆదరించారని తెలిపారు.. హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ అభివృద్ధి పూర్తిస్థాయిలో లేకపోవడం, ఇరుకైన వీధులు, తాగునీటి సౌకర్యాల కొరత, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల మౌలిక సదుపాయాల సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అనేక మున్సిపాలిటీల్లో వర్షం పడితే పలు ప్రాంతాలు, కాలనీలు వరద నీటిలో మునిగే పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే వార్డుల పునర్విభన ప్రక్రియతో కొత్తగా జీహెచ్ఎంసీలో విలీనం అయ్యే ప్రాంతాల ప్రజలపై పన్నుల భారం పెరగుతుందన్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఉపాధి కోసం ఇక్కడికొచ్చి లక్షలాది ప్రజలు నివసిస్తున్న నేపథ్యంలో భౌగోళిక మార్పులు, వార్డుల పునర్విభజన వల్ల అనేక పరిపాలనా, సామాజిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అసంబద్ధమైన, అశాస్త్రీయ నిర్ణయం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, తమ మిత్రపక్షమైన ఎంఐఎంను సంతృప్త పరిచేందుకు తప్ప ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదని విమర్శించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై బాధిత ప్రాంతాల ప్రజలతో కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. భౌగోళికంగా జరిగే రాజకీయ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండి పార్టీ కార్యకర్తలందరూ సమష్టి పోరాటానికి సిద్ధం కావాలని రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





