– వెంటనే మైనింగ్ ప్రక్రియ ఆపాలి
– సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: సూర్యా పేట జిల్లాలో మైనింగ్ ఈ-వేలంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని,టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సుమారు 1,100 ఎకరాల రిజర్వ్ డ్ ఫారెస్ట్ పై స్పష్టత లేకుండానే వేలం నిర్వహించారని ఆరోపించారు. కీలక సాంకేతిక వివరాల్లో లోపం, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, డీజీపీఎస్ సర్వే వివరాలు వెల్లడించలేదని విమర్శించారు. జియోలాజికల్ నివేదికలు సైతం లేవని ఆరోపించారు. మినరల్ ఆక్షన్ రూల్స్-2015 ఉల్లంఘన జరిగిందన్న హైకోర్టు సూచనలు పట్టించుకోలేదన్నారు. పర్యావరణ అనుమతులు పూర్తికాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్ల ప్రకటన, కంపెనీల ఎంపికపై అనుమానాలున్నాయన్నారు. కేసులు ఎదుర్కొంటున్న డెక్కన్ సిమెంట్స్, ఎన్సీఎల్ ఇండస్ట్రీకు బ్లాక్ ల కేటా యింపుపై సందేహాలు న్నాయని తెలిపారు. టెండర్ రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అన్ని అనుమతుల తర్వాతే పారదర్శకంగా కొత్త వేలం నిర్వహించాలని సూచించారు. గనుల శాఖ చేపట్టిన ఈ-వేలం పక్రియ పారదర్శకతకు విరుద్ధంగా సాగిందని ఆయన విమర్శించారు. టెండర్ నోటీసు జారీ కి ముందే మినరల్ బ్లాక్లను ఖచ్చితంగా గుర్తించి పూర్తి వివరాలు వెల్లడించడం తప్పనిసరి అయినప్పటికీ నిబంధనలు పాటించలేదని విమర్శించారు. ఈ అక్రమ టెండర్లపై మరింత ఆందోళన కలిగించే అంశాలను కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. న్యాయపరమైన విచారణలు పెండింగ్ లో ఉన్నప్పటికీ వేలాన్ని ముందుకు తీసుకెళ్లడం, హైకోర్టు సూచనలను పట్టించుకోకపోవడం, చట్టపరమైన, పర్యావరణ అనుమతులు పూర్తికాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్లను ప్రకటించడం వంటి అంశాలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. మైన్స్ అండ్ జియోలజీ శాఖ లీగల్ ఆఫీసర్ ఈ బ్లాక్ సమాచారాన్ని గోప్యంగా పేర్కొంటూ ఫిర్యాదుదారునికి ఇవ్వడానికి నిరాకరించడం పారదర్శకతపై అనుమానాలు పెంచుతోందన్నారు. ప్రస్తుత వేలం పక్రియకు సంబంధించిన అన్ని చర్యలను తక్షణమే నిలిపివేయాలని, టెండర్ పక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర, పారదర్శక విచారణను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని, అవసరమైన శాస్త్రీయ సర్వేలు, జియోలాజికల్ డేటా వెల్లడి, అటవీ అనుమతులు పొందిన తర్వాత మాత్రమే చట్టబద్ధంగా కొత్త టెండర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకోవాలని కేటీఆర్ కోరారు. ఈ లేఖ ప్రతులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా పంపారు.
వేయి కోట్లు వసూలుకు వచ్చారా :కేటీఆర్ ఎద్దేవా
లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి కేటీఆర్ తన అధికారిక ‘ఎక్స్ ‘ఖాతాలో ఆసక్తికర పోస్టు చేశారు. గాంధీ కుటుంబానికి రూ.1000 కోట్లు ఇస్తానని ఇటీవల సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. ‘హలో రాహుల్ గాంధీ.. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఏటీఎం అయిన తెలంగాణకు స్వాగతం అంటూ వెల్కమ్ చెప్పారు. ‘మీరిప్పుడు సీఎం దగ్గర రూ.1000 కోట్లు వసూలు చేసుకోవడానికి వచ్చారా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. పనిలో పనిగా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు, 420 ఇతర వాగ్దానాల పురోగతిని సమీక్షించడంపై కూడా శ్రద్ద పెట్టండి అని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





