అటవీ శాఖ అమరుల త్యాగం చిరస్మరణీయం

– అమ‌ర‌వీరుల‌ స్తూపం వద్ద శ్రద్ధాంజలి
– వారి కుటుంబాలకు ప్రభుత్వ అండ
– అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: వన సంపద సంరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ శాఖ అధికారుల, సిబ్బంది త్యాగం చిరస్మరణీయమని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. నెహ్రూ జులాజికల్‌ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన అటవీ అమరవీరుల సంస్మరణ దిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో 1984 నుండి ఇప్పటివరకు 22మంది అటవీ సిబ్బంది ధైర్యసాహసాలతో, అంకిత భావంతో పనిచేసి అటవీ నేరాలకు పాల్పడిన వారిని పట్టుకోవడంలో, అటవీ సంపద పరిరక్షణలో తమ అమూల్యమైన ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. రాష్ట్ర అటవీ శాఖ అధికారులు అటవీ రక్షణలో భాగంగా 2025లో రూ.149.66 కోట్ల కలపకు సంబంధించి 96,813 కేసులు నమోదు చేసి రూ.51.50 కోట్ల జరిమానా వసూలు చేశారని తెలిపారు. నేరస్తులు తెలియని కేసులు 29,858 నమోదు చేసి రూ.67.13 కోట్ల విలువ కలిగిన టేకు, మారు జాతి కలపను జప్తు చేసినట్లు పేర్కొన్నారు. అమూల్యమైన అటవీ సంపదను పరిరక్షించడానికి ప్రజల భాగస్వామ్యముతో ఎన్నో పథకాలు, చర్యలు చేపట్టామని చెప్పారు. 174 బేస్‌ క్యాంపులు, 62 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. పశువులు అడవిలో చొరబడకుండా నియంత్రించే కాలువలు నిర్మించామని, సాయుధ పోలీసు దళాలు కలప అక్రమ రవాణా అరికట్టడానికి తోడ్పాటునందిస్తున్నాయని తెలిపారు. పి.డి. యాక్ట్‌ మేరకు టేకు అక్రమ రవాణాదారులను అరెస్టు చేస్తున్నామని, అటవీ శాఖ సిబ్బంది పోలీసు అధికారుల సాయంతో కేసులు నమోదు చేస్తున్నారని వివరించారు. అటవీ శాఖ సిబ్బందిని మరింత బలోపేతం చేసే చర్యలు తీసుకుంటున్నామన్నారు. పి.డి. యాక్టుకి తగిన సవరణలు చేసి నేరస్తులకు కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2022లో 1516మంది రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వగా 1,393 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు, 15మంది ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్లు, 18మంది ఏసిఎఫ్‌, ఇతర పోస్టులు రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో ఉన్నాయని పేర్కొన్నారు. అడవుల రక్షణ, స్మగ్లింగ్‌ నిరోధానికి సమగ్ర చర్యలు ప్రారంభించామని, వన్యప్రాణుల ఆవాసాల మెరుగుకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి చెప్పారు. తొలుత అమరుల స్తూపం వద్ద పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించి అమరులకు నివాళులర్పించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీి డాక్టర్‌ జితేందర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ నదీమ్‌ అహ్మద్‌, పిసిసిఎఫ్‌ హెడ్‌ సువర్ణ, పిసిసిఎఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఏలూ సింగ్‌ మేరు, సీసీఎఫ్‌ ప్రియాంక వర్గీస్‌, జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి, వివిధ విభాగాల అధికారులు అమరులకు ఘనంగా నివాళులర్పించారు. వివిధ విభాగాల ఫారెస్ట్‌ అధికారులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *