23.జనధర్మో విజయతే
ఆ సందర్భంలోనే రావి నారాయణ రెడ్డి గారు దొడ్డి కొమురయ్య హత్య గురించి పేర్వారం జగన్నాథం వివరించారు. అట్లాంటి దాడిలోనే విస్నూర్ దేశముఖు గూండాలు 1946 ప్రాంతాన కడవెండిలో దొడ్డి కొమురయ్యను హతమార్చినారు. ఈ సమయంలో కొద్దిరోజులు ఉద్యమం స్తబ్దంగానే ఉన్నది. ఈ అదను చూసి నిజాం పోలీసులూ సైన్యం సాయుధులై ప్రజల మీద దాడులు ప్రారంభించినారు.

అందువల్ల ఆగస్టు 1947 నుండి ప్రజా వెల్లువ ఇంకా ఉధృతమైంది. దీన్ని అణచడం కోసం సాయుధ రజాకార్లు అవతరించడంతో, తుపాకులు రంగంలోకి వచ్చినాయి. ఇక గత్యంతరం లేక ఆత్మరక్షణ కోసం మేము 11 సెప్టెంబరు 1947 నాడు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినాము. అందువల్ల నేను మనవి చేసేదేమంటే – మేమే ముందుగా సాయుధ పోరాటాన్ని ప్రారంభించినా మనుకోవడం పొరపాటు. ఆత్మ రక్షణ కోసం ప్రజలే సాయుధులై తిరుగబడినారు. అప్పుడు పరిస్థితులు కూడ సాయుధ పోరాటానికి అనుకూలంగానే ఉండెను ఎందుకంటే :
- ఎ) ఇంతకుముందు ఆంధ్ర మహాసభలోనూ, స్టేట్ కాంగ్రెస్లోనూ పని చేసి పలుకుబడి కలిగిన కొందరు ప్రముఖ జాతీయ నాయకులు కమ్యూనిస్టులుగా మారినారు.
- బి) కమ్యూనిస్టు పార్టీ ఇతర పార్టీలు చేయని బడుగు వర్గాలవారి సమస్యల్ని ఉద్యమ సమస్యలుగా తీసుకొని పోరాడింది. కనుక అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజల్ని ఆకర్షించింది.
- సి) ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ దేశంలోకెల్ల బలమైందిగా ఉండెను. దాని సహాయం తెలంగాణా సాయుధ పోరాటానికి సంపూర్ణంగా లభించింది.
- డి) అల్పసంఖ్యాక ప్రజల భాషా సంస్కృతులు రాజ్యమేలుతూ, అధిక సంఖ్యాక ప్రజల భాషా సంస్కృతుల్ని రూపుమాపుతున్న వాతావరణం హైదరాబాదు సంస్థానంలో ఉండెను.
- ఇ) హైదరాబాదు సంస్థానంలో స్టేట్ కాంగ్రెసు బలహీనంగా ఉండింది. రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాన్ని స్టేట్ కాంగ్రెసు నడుపుతుందన్న విశ్వాసం ప్రజలకు లేకుండెను.
నిజాం పోలీసులతో కుమ్మక్కైనా ప్రజాచైతన్యాన్నిఆపగలరా?
రావి నారాయణ రెడ్డిగారితో ఇంటర్వ్యూ లో పేర్వారం జగన్నాథం 1947 ప్రాంతంలో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రారంభించవలసిన అవసరం మీకానాడు ఏ విధంగా కలిగిందనీ ప్రశ్నించారు. ఆయన ఈ విధంగా వివరించారు.
తెలంగాణాలో సాయుధ పోరాటాన్ని ప్రారంభించాలన్న అభిప్రాయం మాకు మొదట్లో లేకుండెను. భువనగిరి ఆంధ్ర మహాసభల తరువాత ఆ చైతన్యాన్ని చూసి హడలెత్తిన ప్రజాచైతన్యం పెల్లుబికింది. ఫ్యూడల్స్, నిజాం పోలీసులతో కుమ్మక్కై, సుమారు 1000 మంది మా కార్యకర్తలపై, బూటకపు కేసులు పెట్టి, ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసినారు. కోర్టుల వెంట తిరిగి తిరిగి మా కార్యకర్తల్ని విడిపించుకోవలసి వచ్చింది. కోర్టులతో లాభంలేదని గమనించిన ఫ్యూడల్స్, గూండాలను ఉసిగొల్పి, మాపై లాఠీలతో దాడులు ప్రారంభించినారు.
కమ్యూనిస్టు మహాసభ రెండు తప్పుడు నిర్ణయాలు
1948లో పోలీసు చర్య జరిగిన వెంటనే, తెలంగాణా సాయుధ పోరాటాన్ని ఆపివేయవలసి ఉండెనన్న మీ వాదనను మీలో కొందరు మార్క్సిస్టులు ఖండిస్తూంటే, 1951లో దాన్ని విరమించడం ప్రజా విద్రోహ చర్యగా ఈనాడు నక్సలైటు వర్గాలు భావిస్తున్నాయి. దీని మీద మీ వ్యాఖ్యానం అని పేర్వారం అడిగారు. ‘‘ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 1948లో కలకత్తాలో జరిగిన రెండవ అఖిలభారత కమ్యూనిస్టు మహాసభ రెండు తప్పుడు నిర్ణయాలను తీసుకున్నది’’ అని అంటూ కారణాలు ఈ విధంగా వివరించారు.
- స్వతంత్ర భారతదేశాన్ని పరిపాలిస్తున్న జాతీయ నాయకుల్ని సామ్రాజ్యవాద తొత్తులుగా చిత్రించి, నెహ్రూ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నది. ఈ వ్యవహారం నెహ్రూను ‘చాంగ్ కై షేక్ ఆఫ్ ఇండియా‘ అని అభివర్ణించే దాకా వెళ్లింది.
- తెలంగాణా సాయుధ పోరాటాన్ని కొనసాగించాలన్నది.
కమ్యూనిస్టు పార్టీ అప్పుడు తెలంగాణా ప్రజల చైతన్యాన్ని అధికంగా అంచనా వేసింది. నిజాం కాలంలో తెలంగాణాలో చెలరేగిన చైతన్యం సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజాస్వామిక వెల్లువ. కాని సోషలిస్టు వ్యవస్థ కోసం వచ్చింది కాదు. కమ్యూనిస్టు పార్టీ, ఆ, చైతన్యాన్ని అపార్థం చేసుకున్నది. ఈ అభిప్రాయాన్ని నేను మొదటి నుంచీ వ్యక్తం చేస్తూ వస్తున్నాను. ఐనా అగ్రనాయకులు దీన్ని పట్టించుకోలేదు. చైనా వంటి దేశాల్లో జాతీయ వాదులూ, కమ్యూనిస్టులూ కలిసి పోరాడినారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనవద్ద లేకుండెనని అన్నారు.
సాయుధ పోరాటాన్ని ఎందుకు ఆపిచేసినారో?
రావి నారాయణ రెడ్డి ..‘‘ఈ నేపథ్యంతో 1948 లో సాయుధ పోరాటాన్ని ఆపివేయకూడదని వాదించిన వాళ్లే, 1951లో పోరాటాన్ని ఎందుకు ఆపివేసినారో వాళ్లనే అడగాలి. పోలీసుయాక్షన్ కన్నముందు నాయకులు తక్కువ గానూ ప్రజలు ఎక్కువగానూ చచ్చినారు. అప్పుడు 4000 మంది యోధులు అమరవీరు లైనారు. 3000 గ్రామాలు నిజాం నిరంకుశ పరిపాలన నుండి విముక్తమైనాయి. కాని పోలీసు యాక్షన్ తరువాత సాగించి సాయుధ పోరాటంలో నాయకులు ఎక్కువగానూ, ప్రజలు తక్కువగామా చచ్చినారు. ఎందుకంటే వాళ్లకు ప్రజల సహకారం లేదు.
ప్రజల భాగస్వామ్యం లేదు. భూసమస్య మీద వాళ్లకొక డాక్యుమెంటు లేదు. ఒక మేనిఫెస్టోలేదు. అది కేవలం నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన పోరాటంగానే ఉండింది. నిజం చెప్పాలంటే, పోలీసు యాక్షన్ కన్నముందు పంచిన భూముల్ని యూనియన్ సైన్యం కాపాడింది. కౌలుదారులకు రక్షణ కలిపించింది. నంజప్ప హరిజనులకూ పేదలకు భూము లివ్వాలని వాదించినాడు. ఐనా కమ్యూనిస్టు పార్టీ గుడ్డిగా పోరాటాన్ని సాగించి యువయోధుల నెందరినో అనవసరంగా పోగొట్టుకున్నది. అందువల్ల ఆ పోరాటం విఫలమైందని చెప్పారు.
తెలంగాణా సాయుధ పోరాటానికి, నక్సలైట్ల ఉద్యమం
అప్పటి తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి, నేటి నక్సలైటు వర్గాలు నడుపుతున్న సాయుధ పోరాటానికి తాత్త్వికంగా గానీ, స్వాభావికంగా గానీ పోరాటం ఎత్తుగడలో గానీ ఏమైనా సామ్య వైషమ్యాలున్నాయా? అని జగన్నాథంగారు ప్రశ్నించారు. తెలంగాణా సాయుధ పోరాటానికి, నక్సలైట్ల ఉద్యమం వికృతరూపం అంటూ నారాయణ రెడ్డి వివరించారు. ‘‘ఆయుధాలు ధరించడంలో తప్ప ఏవిధమైన పోలికలు లేవు. అక్కడ పోరాటంలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఇక్కడ అదేమీలేదు.. ‘అన్నలు‘ మాకేమి సంపాదించి పెడతారన్న దుష్ప్రమలో ఈనాడు ప్రజలున్నారు తప్ప, పోరాటంలో పాల్గొనడం లేదు. వీళ్లది వ్యక్తిగత హింసావాదం. ప్రపంచంలో ఇట్లా చాలా చోట్ల జరుగుతున్నది. కాని సత్ఫలితాలు కలగడం లేదు. కలగవు కూడ. నక్సలైట్లది చైనాలో వచ్చిన మార్గం కూడ కాదు.
అక్కడ సన్య ట్ సేన్ నాయకత్వంలో స్వాతంత్య్రం కోసం సామ్రాజ్యవాదానికి, చక్రవర్తులకు వ్యతిరేకంగా జాతీయవాదులూ కమ్యూనిస్టులూ కలిసి పోరాడినారు. సన్యట్ సెన్ చనిపోయిన పిదప చాంగ్ కై షేక్తో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు మావో సైన్యంలో ఒక భాగంతో బైటకువచ్చినాడు. అక్కడి పరిస్థితులవంటివి కానీ ఆ పోరాటపు టెత్తుగడల వంటివి కానీ ఇక్కడ లేవు. దరిదాపు 22 సంవత్సరాల నుండి నక్సలైట్లు పోరాడుతున్నారు కదా! వాళ్లు సాధించిన విముక్తి ప్రాంతమేదైనా ఉన్నదా? ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న యువ యోధులను విద్యావంతులను కార్యశూరులను వ్యర్థంగా పోగొట్టుకుం టున్నారు. వాళ్లు సాధించదలచుకున్న ఆదర్శాలు ఎంత గొప్పవైనా సాధనా మార్గం ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదు. వాళ్లు ప్రజల్ని సమీకరించాలి. ప్రజాస్వామ్య విధానంలో పోరాడాలి. ప్రజాఉద్యమాన్ని నిర్మించాలి.
నక్సలైట్లు దేశభక్తులే
నక్సలైట్లు దేశభక్తులే అని నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఐతే ప్రభుత్వం దీన్ని కేవలం లా అండ్ ఆర్డర్ సమస్యగానే పరిగణించడం తప్పు. నక్సలైట్లు ‘తప్పుడు విధానములు అవలంబిస్తున్నా దేశభక్తు’లనే నేను భావిస్తున్నాను. ప్రభుత్వం తీవ్రమైన సంస్కరణలు గ్రామాలలోనూ పట్టణాలలోనూ తీసుకరావాలి. బీదలకు భూమిని పంచడంతోనే భూసంస్కరణ ఆగిపోకూడదు. దానికవసరమైన పెట్టుబడులను కూడ ప్రభుత్వం పెట్టి, పేద రైతుల్ని ప్రోత్సహించాలి.
నగరములలో పట్టణములలో ఉండే ఆస్తులకు నిధులకు కూడ పరిమితిని విధించాలి. ప్రతివానికి పని కలిపించి బ్రతుకు తెరువును చూపించాలి. డబ్బంతా ఈనాడు పెట్టుబడిదారుల చేతుల్లోనూ వర్తకుల చేతుల్లోనూ ఉన్నది. అది ప్రజాపరం కావాలి. అప్పుడే నక్సలిజం వంటి అతితీవ్రవాద ఉద్యమాలకు చోటుండదు. ఇవి చేయక నక్సలిజాన్ని ప్రభుత్వం ఎంత అణచినా, అది వేరే రూపంలో ప్రత్యక్షమవుతూ ఉంటుంది అని జవాబిచ్చారు.

నారాయణరెడ్డి 1908, జూన్ 4న ఉమ్మడి నల్లగొండ జిల్లా బొల్లేపల్లిలో జన్మించారు. హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్ మిడిల్ స్కూల్లో ఫస్ట్‌ఫారం చదువుకున్నారు. బండి యాదగిరి రాసిన నైజాము సర్కరోడా అనే పాటకు రావినారాయణ రెడ్డి, భీమ్ రెడ్డి నర్సింహారెడ్డి ప్రేరణ వారు. చదువరాని వారిని సైనికులగా పోరాటాన్ని నూరుపోసిన వారు నారాయణ రెడ్డి.
చాదార్ ఘాట హైస్కూల్ లో, నిజాం కాలేజిలో ఇంటర్ చదువుకున్నారు. 1930 లో కాకినాడలో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1934న గాంధీని ఆహ్వానించి అంటరాని నివారణకు ప్రచారం చేసారు. నారాయణ రెడ్డి భార్య సీతాదేవి ఒంటిపై నగరాన్ని అమ్మి ఆ సొమ్ముతో స్వరాజ్య నిధికి ఇచ్చారు. 700 ఎకరాలలో 500 ఎకరాలను పేదలకు పంచారు. వారికి 1992లో పద్మవిభూషణ్ గా గుర్తింపు లభించింది. కాని అంతకుముందే చనిపోయారు. 1952లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి గెలిచిన తొలి ఎంపీ ఆయన.





