చమురు ధరలతో మార్కెట్ల కుదేలు

–  రూపాయి విలువ ప‌డిపోవ‌డంతో దేశీయ మార్కెట్లపై ప్రభావం

న్యూదిల్లీ, మార్చి 9: పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లు దాటింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందనే అంచనాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో ఉండడం, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి భారీగా పతనమవడం దేశీయ సూచీలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిప్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపు (78,918)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 2000 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పతనమైంది. మరో 600 పాయింట్లు కిందకు వెళ్లింది. చాలా రోజుల తర్వాత సెన్సెక్స్ 70,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 2037 పాయింట్ల నష్టంతో 76,881 వద్ద కొనసాగింది. మరోవైపు నిప్టీ కూడా భారీగా నష్టపోయింది. 2.5 శాతానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం 624 పాయింట్ల నష్టంతో 23,826 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్, నిప్టీలో ఎమ్‌సీఎక్స్ ఇండియా, కోల్ ఇండియా మొదలైన షేర్లు మాత్రమే స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, యూనో మిండా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, హిందుస్థాన్ పెట్రో మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిప్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1587 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిప్టీ 2280 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.32గా ఉంది.

ఆర్థిక సంక్షోభం.. తగ్గుతున్న బంగారం ధరలు

న్యూదిల్లీ, మార్చి 9 : కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు సోమవారం మరింత కిందకు వచ్చాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం పడిపోతుండడం నిపుణులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. సోమవారం వెండి కేజీకి రూ.5 వేల మేర తగ్గింది. మరోవైపు బంగారం ధర కూడా భారీగా తగ్గింది. సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో హైదారాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,61,680కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే దాదాపు రూ.1960 మేర తగ్గుదల నమోదు అయింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,200 దగ్గర ఉంది. ముందటి రోజు ధరతో పోల్చుకుంటే రూ.1800 మేర తగ్గింది. మరోవైపు వెండి కూడా భారీ తగ్గుదల నమోదు చేసింది. సోమవారం కిలోకు రూ.5 వేల మేర తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.80 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.90 లక్షలుగా ఉంది.]


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *