మావోయిస్టుల అరెస్టును ఖండించండి

– ‘కగార్’ యుద్ధానికి మద్దతునివ్వొద్దు
– తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
– సిర్పూర్ (యు) పరిధిలో 16 మంది అరెస్టుపై మండిపాటు

– బీజేపీ ఫాసిస్టు విధానాలపై పోరాడాలని పిలుపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిరాయుధంగా ఉన్న తమ సహచరుల అరెస్టును భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. సిర్పూర్ (యు) మండలంలోని కకర్ బుడ్డీ, బాబ్జీపేట గ్రామాల పరిసరాల్లో నిరాయుధంగా ఉన్న 16మంది పార్టీ కార్యకర్తలను, మరో ఇద్దరు గ్రామస్థులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని పార్టీ అధికార ప్రతినిధి జగన్ బుధ‌వారం ఒక ప్రకటనలో ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజాస్వామిక, ప్రశాంత వాతావరణానికి ఈ అరెస్టులు ఎదురుదెబ్బ అని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోని ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం రూపొందించిన ‘కగార్’ యుద్ధ తంత్రానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ఇవ్వకూడదని మావోయిస్టు పార్టీ కోరింది. అరెస్టు చేసిన వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేసింది. తెలంగాణలో ప్రశాంత వాతావరణం కొనసాగేలా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు ఈ అణచివేత చర్యలను ఖండించి, ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

కార్పొరేట్ శ‌క్తుల కోసమే బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ య‌త్నాలు  

కేంద్రంలోని ఆర్‌ఎస్ఎస్-బీజేపీ కూటమి కేవలం కొద్దిమంది కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని జగన్ విమర్శించారు. దేశంలో మనువాద కుల వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వ అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ‘మావోయిస్టు ముక్త్’ భారత్ పేరుతో కమ్యూనిస్టు భావజాలాన్ని, ‘ప్రతిపక్ష ముక్త్’ పేరుతో ఇతర పార్టీలను నిర్వీర్యం చేసేందుకు ‘కగార్’ యుద్ధాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు.  ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’, ‘ఏక్ చునావ్ – ఏక్ పార్టీ’ నినాదాలతో దేశంలో ఏక పార్టీ పాలన సాగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఎలక్షన్ కమిషన్, సీబీఐ, ఎన్ఐఏ, కోర్టుల వంటి రాజ్యాంగ వ్యవస్థలను తమ గుప్పిట్లో ఉంచుకుని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, దీనికి బీహార్ ఎన్నికలే తాజా ఉదాహరణ అని ప్రకటనలో వివరించారు. దేశ ప్రజలకు, కార్మిక వర్గాలకు ప్రమాదకరంగా మారిన ఆర్‌.ఎస్.ఎస్-బీజేపీల ఆర్థిక పాలసీలను ఎదుర్కొనేందుకు అన్ని వర్గాలు ఏకమై పోరాడాలని జగన్ పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *