భద్రాచలం, ప్రజాతంత్ర, జులై 15 : ఈనెల 28 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించుకోవాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ఒక్క ఏడాదిలో 357మంది నక్సలైట్లు భద్రతాదళాల చేతిలో హత్యకు గురయ్యారని, వారిలో 136మంది మహిళలు, నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 15మంది రాష్ట్ర కమిటీ మావోయిస్టులు ఉన్నారని తెలిపింది. తమకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కూంబింగ్ కారణంగా మావోయిస్టు సంస్థల పరిస్థితి దారుణంగా ఉందని, నిరంతరం తమను లక్ష్యంగా చేసుకుంటుండడంతో కొందరు మావోయిస్టులు బలవంతంగా లొంగిపోతుండడం లేదా అరెస్టు అవుతుండడం జరుగుతోందని, లేదా భద్రతా దళాల తూటాలకు బలవుతున్నారని కమిటీ తెలిపింది. దండకారణ్యంలో మావోయిస్టు సంస్థ అతిపెద్ద నష్టాన్ని చవిచూసిందంటూ గోండి మాండలికం, ఆంగ్లంలో 24 పేజీల బుక్‌లెట్‌ను కేంద్ర కమిటీ విడుదల చేసింది. మావోయిస్టు సంస్థకు అతిపెద్ద నష్టం దండకారణ్యంలోనే జరిగిందని, అక్కడ 281 మంది మావోయిస్టులు మరణించారని తెలిపింది. కేంద్ర కమిటీ నివేదిక ప్రకారం గత ఏడాది కాలంలో భద్రతా దళాల చేతిలో హతమైన మావోయిస్టులలో నలుగురు సిసి సభ్యులు, 15 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ 24 పేజీల బుక్‌లెట్‌లో ఈ అంశాల్ని పేర్కొింది. తమ సహచరుల జ్ఞాపకార్థం అమరవీరుల వారోత్సవాన్ని జరుపుకోవాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.
28 నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు



