మావోయి ‌పార్టీలో గందరగోళం

– మల్లోజుల లేఖపై పార్టీలో అసహనం
– పార్టీకి సంబంధం లేదని వెల్లడి
– వేణుగోపాల్‌ను ఉద్యమ ద్రోహిగా ప్రకటన
– ఆయుధాలు సరెండర్‌ ‌చేయాలని ఆదేశం

ఖమ్మం, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 23: ‌మావోయిస్ట్ ‌పార్టీలో గందరగోళం నెలకొంది. అగ్రేతలు ఒక్కొక్కరే నేలకు ఒరుగుతున్నారు. పటిష్ట నాయకత్వం  లేకుండా పోయింది. దీనికితోడు కోవర్ట్ ఆపరేషన్లు పార్టీ ఉనికినే దెబ్బతీస్తున్నాయి. మరోవైపు వరుస ఎన్‌కౌంటర్లు పార్టీని తుడిచి పెట్టేలా చేస్తోంది. ఆపరేషన్‌ ‌కగార్‌తో నేతలను మట్టుబెడుతున్నారు. రిక్రూట్‌మెంట్‌ ‌కూడా పూర్తిగా ఆగిపోయింది. ఈ క్రమంలో సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని తమ పార్టీ నిర్ణయించుకుంటున్నదని మావోయిస్టు సీనియర్‌ ‌నేత మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ ‌భూపతి రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. దీంతో తేరుకున్న మావోయిస్టులు అది పార్టీ విధానం కాదని ప్రకటించింది. ఆయనను ఉద్యమద్రోహిగా ప్రకటించింది. మల్లోజులపై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలు తీసుకుంది. అతడిని ద్రోహిగా ప్రకటించడంతోపాటు, ఆయన వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. లేనట్లయితే వాటిని పీపుల్స్ ‌గొరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. ఆయుధాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నా మంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో అభయ్‌ ‌పేరుతో మల్లోజుల వేణుగోపాల్‌ ఇటీవల లేఖ విడుదల చేసిన క్రమంలో పార్టీలో గందరగోళం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రకటనను తప్పుబట్టిన కేంద్ర కమిటీ, పార్టీపై మల్లోజుల వేణుగోపాల్‌ ‌తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. కాల్పుల విరమణ, శాంతి చర్చలపై అతడి ప్రకటనను ఖండించింది. లొంగిపోయేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పేర్కొంది. మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ ‌కిషన్‌జీకి వేణుగోపాలరావు తమ్ముడు అవుతారు. మారిన ప్రపంచ, దేశ పరిస్థితుల దృష్ట్యా.. ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతి లో చేరాలని ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రి, సీనియర్‌ ‌పోలీస్‌ అధికారులు నిరం తరం చేసిన అభ్యర్థనల దృష్ట్యా తమ పార్టీ ఆయుధాలను వదులు కోవాలని నిర్ణయించుకుంటు-న్నదని ఆ పార్టీ నేత అభయ్‌ ‌పేరుతో ఈ నెల 16న ఒక లేఖ విడుదలైన విషయం తెలిసిందే. సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని తమ పార్టీ నిర్ణయించుకుంటున్నదని అందులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యల పై అన్ని రాజకీయ పార్టీలు, పోరాడుతున్న సంస్థలతో వీలైనంత వరకు కలిసి పోరాడుతామని వివరించారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రితో లేదా ఆయన నియమించిన వ్యక్తులతో లేదా ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మారిన తమ పార్టీ అభిప్రాయం గురించి పార్టీకి తెలియజేయడం తమ బాధ్యత అని, పార్టీలో ఈ అంశాన్ని అంగీకరించేవారు లేదా వ్యతిరేకించేవారు చర్చల్లో అంగీకరించి పాల్గొనే సహచరుల నుంచి ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ప్రస్తుతం తమతో అందుబాటులో ఉన్న పరిమిత క్యాడర్‌, ‌కొంతమంది నాయకత్వ సహచరులు ఈ కొత్త విధానాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సహచరులతో, జైల్లో ఉన్న సభ్యులతో సంప్రదించేందుకు నెలరోజుల గడువు ఇస్తూ ‘సీజ్‌ ‌ఫైర్‌’ ‌చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ప్రభుత్వంతో వీడియోకాల్‌ ‌ద్వారా తమ అభిప్రాయాలను పంచుకునేందుకు కూడా తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అయితే, మావోయిస్టు పార్టీలో మారిన ఈ విధానం సంచలం సృష్టిస్తున్నది. మావోయిస్టు పార్టీ సుప్రీం లీడర్‌ ‌బసవరాజు మృతి తరువాత ఇటీవల కొత్త నాయకత్వంలో భాగంగా ఆయన స్థానంలో తిప్పిరి తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా ఎంచుకున్న నేపథ్యం లో ఈ లేఖ విడుదల అవ్వడం మరింత సంచలనం కలిగిస్తున్నది. అంతేకాకుండా, ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు నేత ఫొటోతో ఆ పార్టీ లేఖను విడుదల చేయడం దేశంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చర్చానీయాంశంగా మారింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ- ప్రతినిధి అభయ్‌ ‌పేరుతో వచ్చిన ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి, మావోయిస్టు ఉద్యమ ప్రభావిత రాష్టాల్ర ముఖ్యమంత్రులు, హోంశాఖ మంత్రులు శాంతిచర్చల పట్ల అనుకూలమైన వైఖరిని అవలంబించిన పాలక,  ప్రతిపక్ష పార్టీల నాయకులు, శాంతి కమిటీ సభ్యులు, జర్నలిస్టులు, ప్రజల ముందు మావోయిస్టు పార్టీ తన మారిన వైఖరిని స్పష్టంచేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతిచర్చలకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని ఈ ఏడాది మార్చి చివరి వారం నుంచి విజ్ఞప్తి చేస్తున్నట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఇదే ప్రతిపాదనపై మే 10న మావోయిస్టు పార్టీ ప్రతినిధి అభయ్‌ ‌పేరుతో పత్రికా ప్రకటన విడుదల చేసినట్టు- తాజా లేఖలోనూ మావోయిస్టులు తెలిపారు. అందులో తమ పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్టు ప్రస్తావించారని పేర్కొన్నారు. అదే విధంగా ప్రభుత్వానికి కాల్పుల విరమణ సైతం ప్రతిపాదించినట్టు వివరించారు. ఈ ముఖ్యమైన అంశంపై తమ పార్టీ నాయకత్వ, సహచరు లతో సంప్రదించడానికి ఒక నెల రోజుల సమయం కావాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోగా.. గత ఏడాది జనవరి నుంచి వేలాది సంఖ్యలో జరుపుతున్న సైనిక దాడిని తీవ్రతరం చేసింది. వేలాదిమంది సాయుధ పోలీస్‌ ‌బలగాలను మోహరించి చుట్టుముట్టి నిర్మూలన దాడి జరిపింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది మే 21న మాడ్‌ ఏరియాలోని గుండెకోట్‌ ‌సపంలో జరిగిన భీకరదాడిలో ధైర్యంగా ప్రతిఘటించిన తమ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ ‌బసవరాజుతోపాటు 28 మంది కేంద్ర కమిటీ సభ్యులు, సహచరులు, వారి భద్రతా సిబ్బంది అమరులైనట్టు పేర్కొన్నారు. గతంలో జరిగిన శాంతిచర్చల పక్రియను సగంలో వదిలి వేయకుండా అభయ్‌ ఆలోచనలకు అనుగుణంగా శాంతి చర్చలను ముందుకు తీసుకువెళ్లాలని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు, ఇందుకోసమే ఈ పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి చొరవతో ప్రారంభమైన శాంతి చర్చల పక్రియను ముందుకు తీసుకెళ్తున్నట్టు పేర్కొన్నారు. మొత్తంగా ఇప్పుడు మల్లోజుల వ్యవహారంతో మావోయిస్టుల్లో భేదాభిప్రాయాలు బట్టబయలు అయ్యాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *