– మావోయిస్టులపై అసత్య ప్రచారం మానుకోవాలి
– ప్రజా కోర్టులో శిక్ష తప్పదు
– భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి
భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : విప్లవోద్యమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పాశవిక దాడులతో మావోయిస్టు పార్టీపై భూస్వామ్య పెత్తందారులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి విప్లవ హెచ్చరిస్తూ లేఖ విడుదల చేశారు. విప్లవోద్యమంపై, ప్రజలపై భూస్వామ్య పెత్తందారులు మళ్లీ పెచ్చరిల్లుతున్నారని, ప్రజలపై జరుగుతున్న దాడులను మావోయిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కొందరు పెత్తందారులు ఈ పోకడలకు పాల్పడుతున్నారని, రాజకీయ బ్రోకర్లతో కలిసి పైశాచిక చర్యలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పెత్తందారుల్లారా ఖబడ్దార్.. పద్ధతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదు అని ఆ లేఖలో పేర్లను ప్రస్తావించారు. చాలామంది అధికార పార్టీ నాయకులు పై వర్గాలకు వంత పాడుతున్నారన్నారని, వారి దోపిడీకి సహకరిస్తున్నారంటూ భూస్వాముల భూములను పేదలకు అప్పగించాలని, లేకుంటే వాటిని తమ పార్టీ స్వాధీనపరుచుకుని పేదలకు పంచుతుందని హెచ్చరించారు. రాజకీయ నాయకులు మొదలు కొందరు వ్యాపారులు, భూస్వాములు పోలీసులకు పూర్తి ఇన్‌ఫార్మర్లుగా మారారన్నారు. పోలీసు వ్యవస్థలో పనిచేస్తూ తమ పార్టీకి సహకరిస్తున్నట్లుగా మోసపూరిత మాటలు చెబుతున్నారని తెలిపారు. వారికి ప్రజా కోర్టులో మరణశిక్ష తప్పదని హెచ్చరించారు. అలాంటి వారు మారాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అడవిలో ఖనిజ సంపదను ఎత్తుకెళ్లేందుకు బ్రాహ్మణీయ, ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలుపుతూ తమ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గొల్లగొప్ప గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారంపై, పూసిగుప్పలో జరిగిన మరణాలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్‌లో అమరులైన వారి త్యాగాల స్ఫూర్తితో ముందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు. ఆదివాసీలు, పార్టీ సభ్యులపై కొనసాగుతున్న మారణకాండకు బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. ప్రజల కోసం పనిచేసే మావోయిస్టు పార్టీకి ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యావంతులు, జర్నలిస్టులు, పౌర హక్కులు, మానవ హక్కుల సంఘాలు మద్దతు ఇవ్వాల్సిందిగా విప్లవ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





