లొంగిపోయిన మవోయిస్ట్ ‌నారాయణరావు

– వారికి పరిహారం అందిస్తామన్న డీజీపీ
– ఏపీ మావోయిస్టు ఫ్రీ స్టేట్‌ అని ప్రకటన
– మావోయిస్టు
ఉద్యమం కనుమరుగైందన్న నారాయణ

అమరావతి, మార్చి 30 : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెన్నూరు నారాయణ రావు అలియాస్‌ ‌సోమన్న ఏపీ డీజీపీ ముందు లొంగిపోయారు. దాదాపు 36 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన నారాయణ సహా మొత్తం 9 మంది సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏవోబీ స్పెషల్‌ ‌జోనల్‌ ‌కమిటీ, డివిజనల్‌, ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టుల లొంగుబాటుపై ఏపీ డీజీపీ హరీశ్‌ ‌కుమార్‌ ‌గుప్తా వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు కార్యకలాపాలు ముగింపు దశకు చేరుకున్నాయని, ఏపీ ఇప్పుడు నక్సల్స్ ‌ఫ్రీ స్టేట్‌ అని డిజిపి అన్నారు. అందరి కృషితో ఇది సాధ్యమైంది. కాల్పులు కూడా జరిగాయి, లొంగుబాట్లు కూడా జరిగాయి. మా పిలుపునకు స్పందించి 9 మంది లొంగిపోయారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సదుపాయాలు అందిస్తామని వెల్లడించారు. చెన్నూరు నారాయణకు ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. మిగతా వారికి 24.20 లక్షలు అందిస్తున్నాం’ అని చెప్పారు. మావోయిస్టు అగ్రనేత గణపతి కార్యకలాపాలు కూడా రాష్ట్రంలో లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి, భద్రతలు మరింత బలపడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టు నారాయణ మాట్లాడుతూ.. గతంలో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని చెప్పారు. దేశంలో మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. సాయుధ పోరాటాన్ని వదిలి.. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని తాను లొంగిపోయినట్లు నారాయణ చెప్పుకొచ్చారు. 1990లో ఉద్దానంలో ప్రజా ఉద్యమానికి ఆకర్షితులు అయ్యాను. అప్పుడే మావోయిస్టు పార్టీలో చేరాను. పార్టీ తీర్మానాలకు అనుకూలంగా పనిచేశాను. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో పనిచేశాను. నేను మావోయిస్టు ఉద్యమాల్లో చేరినపుడు పరిస్థితులు, ఇప్పుడు చాలా మారాయి. మేం పనిచేసిన ఆదివాసీ అటవీ ప్రాంతంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పార్టీ అప్డేట్‌ ‌కాకపోవటమే ఈ వైఫల్యానికి కారణం. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా పార్టీ నిర్ణయాలు తీసుకోవటంతో ఈ పరిస్థితి వచ్చింది. మావోయిస్టు పార్టీ పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్‌ అవలేదు, అందుకే ఏవోబీ సహా దేశ వ్యాప్తంగా పార్టీ కనుమరుగు అయింది’ అని నారాయణ వివరించారు. ’సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సిద్దాంతాలు మారలేదు. అందువల్లే పార్టీ ఇలా అయింది. పార్టీ హత్య చేసిన ఘటనల్లో నేను కూడా భాగస్వామి అయ్యాను. అయితే పార్టీ నిర్ణయాల్లో భాగంగా మాత్రమే అవి జరిగాయి. నాకు ఎవరితో వ్యక్తిగత విభేదాలు, శత్రువుత్వం లేదు. జరిగిన ఘటనకు నేను పశ్చాత్తాపపడుతున్నా’ అని మావోయిస్టు నారాయణ చెప్పారు. నారాయణరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం. ఆయన దాదాపు 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. 1990లో పీపుల్స్ ‌వార్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. మిలిటరీ ఆపరేషన్స్‌లో దిట్ట అనే పేరు నారాయణకు ఉంది. ఏవోబీ స్పెషల్‌ ‌జోనల్‌ ‌కమిటీలో కీలకంగా వ్యవహరిస్తూ.. పార్టీ ఎదుగుదలకు కృషి చేశారు. ఏపీ, ఒడిశాల్లో అనేక కేసులు ఆయనపై ఉన్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *