చీలిక దిశ‌గా మావోయిస్టు ఉద్య‌మం!

“ఉద్య‌మం విస్తృత ల‌క్ష్య సాధ‌న‌కోసం జ‌రిపే పోరాటం ఎక్కువ‌కాలం మ‌న‌లేక‌పోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలోనే హింస వ‌ల్ల ప్రాణాలు పోవ‌డం త‌ప్ప మ‌రే ఇత‌ర ఫ‌లితం లేక‌పోవ‌డంతో, మావోయిస్టు నాయ‌క‌త్వం శాంతి చ‌ర్చ‌ల వైపున‌కు మొగ్గుచూపి ఉంవ‌చ్చు. అయితే అభ‌య్ లేఖ‌ను ఖండిస్తూ జ‌గ‌న్ విడుద‌ల చేసిన మ‌రో ప్ర‌క‌ట‌న‌, సాయుధ‌పోరుపై పార్టీలో ఇంకా విశ్వాసం ఉన్న‌ద‌న్న స‌త్యాన్ని వెల్ల‌డిస్తోంది. పీపీడ‌బ్ల్యు ఇంకా ఆగిపోలేద‌ని, ప్ర‌స్తుత నిర్బంధ ప‌రిస్థితుల్లో స్వీయ ర‌క్ష‌ణ‌కోసం ఒక అడుగు వెన‌క్కు వేసిన‌ప్ప‌టికీ, అనుకూల స‌మ‌యంలో ముందుకెళ్ల‌వ‌చ్చున‌న్న న‌మ్మ‌కం వీరిలో ఇంకా కొన‌సాగుతున్న‌ద‌నుకోవాలి.  అంతేకాదు ఈ విరుద్ధ ప్ర‌క‌ట‌న‌లు గెరిల్లా యుద్ధ నీతిలో నెల‌కొన్న క‌ల‌వ‌ర‌పాటుగా కూడా భావించాలి. ఏది ఏమైనా ఒక్క‌టి మాత్రం నిజం. మావోయిస్టు పార్టీ పెను సందిగ్ధ‌త‌వైపు ప్ర‌యాణిస్తోంది. ముఖ్యంగా ఉద్య‌మాన్ని వ‌దిలేయాల‌నేవారు, కొన‌సాగించేవారుగా రెండుగా చీలిపోయే ప‌రిణామ దిశ‌గా మావోయిస్టు ఉద్య‌మ ప్ర‌స్థానం సాగుతోంది!..”

విప్ల‌వ పోరాటంలో రాజ్యాధికారాన్ని సాధించి, దాన్ని సుస్థిరం చేసుకోవ‌డానికి బ‌లీయ‌మైన రాజ‌కీయ‌, ప్ర‌జా మ‌ద్ద‌తుతో పాటు ప‌టిష్ట‌మైన సైనిక వ్యూహం అవ‌స‌రం. ఇదే స‌మ‌యంలో మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాల‌ను మార్చుకోవ‌డం ప్ర‌ధానం. ఇటీవ‌ల విడుద‌లైన మ‌రాఠీ చిత్రం అత్లి బ‌త్మి ఫుత్లి (అతిర‌హ‌స్యం బ‌ట్ట‌బ‌య‌లు) అనే చిత్ర స‌మీక్ష‌ను ప‌రిశీలిస్తే, ఈ చిత్రాన్ని న‌డిపిన విధానంలో చేసిన త‌ప్పులు మ‌న‌కు న‌వ్వు పుట్టించ‌క మాన‌వు. ఈ చిత్రం ప్ర‌ధానంగా కుట్ర‌పై ఆధార‌ప‌డి న‌డుస్తుంది. అయితే ఈ కుట్ర‌ను అమ‌లు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన ఆధునిక‌త లోపించ‌డం ఇక్క‌డ ప్ర‌ధాన లోపం. విమ‌ర్శ‌కులు దీన్ని హ‌స్యం ఎంత‌మాత్రం లేని అతి శుద్ధ కార్టూన్ చిత్రంగా వ‌ర్ణించ‌డం స‌హేతుక‌మే.

ఇక్క‌డ రెండు  ప‌ర‌స్ప‌ర విరుద్ధ కుట్ర‌లను ఒకే చోట చూపే య‌త్నం జ‌రిగింది. ఇదే ఇందులో ప్ర‌ధాన లోపం. చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర దుర‌వ‌స్థ‌తో ఒక కోణ‌మైతే, మొత్తం చిత్రంలో చూపిన కుట్ర ప‌రిస్థితి మ‌రో కోణం ( ఒక వృద్ధుడు త‌న భార్య‌ను హ‌త్య చేయించి త‌ర్వాత తానుకూడా చ‌నిపోవాల‌నుకుంటాడు. స‌రిగ్గా హ‌త్య జ‌ర‌గాల్సిన స‌మ‌యానికి, త‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న త‌న బిడ్డ ప్రాణాలు కాపాడుకోవ‌డానికి బ్యాంకులో దొంగ‌త‌నం చేసి పోలీసుల‌ను త‌ప్పించుకునే క్ర‌మంలో మ‌రో వ్య‌క్తి ఈ వృద్ధ దంప‌తుల ఇంట్లో చొర‌బ‌డ‌తాడు. ఇక్క‌డ హ‌త్య‌, ప్రాణాలు కాపాడ‌టం అనేవి ప‌ర‌స్ప‌ర విరుద్ధ భావ‌న‌లు).

ప్ర‌స్తుతం మావోయిస్టు నాయ‌క‌త్వంలో కూడా స‌రిగ్గా ఈ చిత్రంలో చూపిన హాస్య స‌న్నివేశం క‌నిపిస్తోంది. ముఖ్యంగా వీరు సాయుధ పోరాటం అనే త‌మ ల‌క్ష్యాన్ని వ‌దిలేశారా? అనే అనుమానం క‌లుగుతోంది. ఇటీవ‌ల మావోయిస్టు ప్ర‌తినిధి అభ‌య్ పేరిట ఒక లేఖ విడుద‌లైంది. ఇందులో భ‌ద్ర‌తా ద‌ళాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు నెల‌రోజుల పాటు కాల్పుల విర‌మ‌ణ ప్ర‌తిపాద‌న వుంది. అభ‌య్ అలియాస్ సోను పేరుతో విడుద‌లైన ఈ లేఖ సాధికార‌త‌పై ఒక‌వైపు ప‌రిశీల‌న జ‌రుగుతుండ‌గానే, తెలంగాణ స్పెష‌ల్ జోన్ క‌మిటీ ప్ర‌తినిధి జ‌గ‌న్ పేరుతో మ‌రో లేఖ విడుద‌లైంది. సోను వ్య‌క్తం చేసిన అభిప్రాయాలు త‌న వ్యక్తిగ‌త‌మ‌ని, అవి పార్టీ అధికార నిర్ణ‌యాలు కావ‌ని స్ప‌ష్టం చేశాడు. ఉద్య‌మం తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న త‌రుణంలో, కేంద్ర ప్ర‌జాస్వామిక సూత్రాల‌కు విరుద్ధంగా ర‌హ‌స్యంగా చ‌ర్చించాల్సిన అంశాల‌ను ఈవిధంగా ఆన్‌లైన్‌లో బ‌హిరంగ ప‌ర‌చ‌డం స‌హేతుకం కాద‌ని స్ప‌ష్టం చేశాడు.

ఈ రెండు లేఖ‌ల‌ను ప‌రిశీలిస్తే అభ‌య్ రాసిన‌ట్టుగా చెబుతున్న లేఖ సాధికార‌త‌పై వొక‌వైపు అనుమానాలు వ్యక్త‌మ‌వుతుండ‌గా, మ‌రోవైపు నాయ‌క‌త్వంలో విభేదాలున్న‌ సంగ‌తి స్ప‌ష్టంగా బ‌హిర్గ‌త‌మైంది. స‌రిగ్గా ఇది అత్లి బ‌త్మి ఫుత్లి (అతిర‌హ‌స్యం బ‌ట్ట‌బ‌య‌లు) చిత్రాన్ని గుర్తుకు తెస్తోంది. ప‌రిస్థితి గ‌మ‌నిస్తే, మావోయిస్టు నాయ‌క‌త్వంలో నెల‌కొన్న సందిగ్ధ‌త‌, అయోమ‌యం, ఇబ్బంది తీవ్ర‌త‌ల‌ను ఇది స్ప‌ష్టం చేస్తున్న‌ది. అంతేకాదు నూత‌న ప్ర‌జాస్వామిక పోరాటం (ఎన్‌డీఆర్‌), దీర్ఘ‌కాలిక ప్ర‌జాయుద్ధం (పీపీడ‌బ్ల్యు)  భ‌విష్య‌త్తుపై కూడా మావోయిస్టు నాయ‌క‌త్వంలో అయోమ‌యం నెల‌కొన్న‌ద‌ని తెలుస్తోంది. ఈ రెండింటి విష‌యంలో మొండిగా ముందుకు పోవ‌డ‌మా? తాత్కాలిక విరామాన్ని ప్ర‌క‌టించ‌డ‌మా? అన్న సంశ‌యం మావోయిస్టు నాయ‌క‌త్వాన్ని వెంటాడుతోంది.

ఈ రెండు ప్ర‌క‌ట‌న‌ల్లోని సాధికార‌త‌ను ప‌క్క‌న బెడితే, మావోయిస్టు విప్ల‌వం ఇప్పుడు రాజ‌కీయ‌, సంస్థాగ‌త‌ సంక్షోభాల‌ను ఎదుర్కొంటున్న‌ద‌న‌డంలో ఎంత‌మాత్రం సందేహం లేదు. 2004లో సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఆవిర్భావం త‌ర్వాత పార్టీ ఇంత‌టి సంక్షోభాన్ని ఇప్ప‌టివ‌ర‌కు ఎదుర్కొన‌లేదు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే, పీపీడ‌బ్ల్యు కేవ‌లం భ్ర‌మ మాత్ర‌మేన‌ని, వ‌ర్త‌మాన రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ్యూహాల‌ను మార్చుకోవాల‌న్న సంగ‌తి అర్థ‌మైన పార్టీ నాయ‌క‌త్వం ఈ విష‌యంపై తీవ్ర‌స్థాయి అంత‌ర్మ‌ధ‌నంలో మునిగిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఆధునిక సామాజిక‌-ఆర్థిక‌, రాజ‌కీయ రంగాల్లో భారత్ లో వ‌చ్చిన పెను మార్పుల నేప‌థ్యంలో ప్ర‌స్తుతం త‌మ పార్టీ అనుస‌రిస్తున్న వ్యూహాత్మ‌క వైఖ‌రి ఎంత‌మాత్రం స‌రిపోద‌న్న స‌త్యం పార్టీ నాయ‌క‌త్వానికి బోధ‌ప‌డింది. ఏది ఏమైనా ప్ర‌స్తుతం పార్టీ నాయ‌కుల‌నుంచి విడుద‌లైన ప‌ర‌స్ప‌ర విరుద్ధ ప్ర‌క‌ట‌న‌లు, ప్ర‌జ‌ల ప‌ట్ల త‌మ ప్రాధాన్య‌తాంశాల‌పై నాయ‌క‌త్వంలో భేదాభిప్రాయాలున్నాయ‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. ఎన్‌డీఆర్‌ను మ‌రింత ముందుకు తీసుకెళ్లే క్ర‌మంలో పార్టీ సామాజిక దృక్కోణాన్ని ప్ర‌జ‌ల్లోకి వాస్త‌విక రూపంలో తీసుకెళ్ల‌క‌పోవ‌డం కూడా ఉద్య‌మ వైఫ‌ల్యానికి కార‌ణంగా నాయ‌క‌త్వం భావిస్తోంది. అంతేకాదు శ‌క్తివంత‌మైన ప్ర‌జా ఉద్య‌మ నిర్మాణం, సామ్రాజ్య‌వాద శ‌క్తుల‌ను ఒంట‌రి చేయ‌డం, ప‌ట్ట‌ణ కార్మిక ఉద్య‌మాల నిర్మాణం వంటి ఎన్‌డీఆర్ లక్ష్యాల స్థానాన్ని ఇప్పుడు వామ‌ప‌క్ష అవ‌కాశ‌వాదం ఆక్ర‌మించింద‌ని భావించాలి. ముఖ్యంగా మావోయిస్టు ఉద్య‌మ మ‌నుగ‌డ ప్ర‌మాదంలో ప‌డిన నేప‌థ్యంలో ప్ర‌స్తుతం దీన్ని అనుస‌రించ‌క త‌ప్ప‌డంలేదు.

పార్టీ ఆవిర్భ‌వించిన ఇన్ని ద‌శాబ్దాల కాలంలో ఎన్నో వొడి దుడుకుల‌ను ఎదుర్కొన్న‌ది. సైనిక ప‌రిష్కారంపై ఆధార‌ప‌డిన ఉద్య‌మం, ప్రజ‌లు-సైనిక ప‌రిష్కారం అనే రెండింటి మ‌ధ్య అనుసంధాన‌త‌ను ఏర్ప‌చ‌డంలో ఇప్ప‌టికీ తీవ్ర సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొంటున్న‌ది. రాజ‌కీయాల‌కంటే, సైనిక చ‌ర్య‌ల‌పైనే ఉద్య‌మం ఎక్కువ‌గా ఆధార‌ప‌డ‌టం, ఇప్పుడు పార్టీ క్ర‌మంగా క్షీణించిపోవ‌డానికి కార‌ణ‌మ‌వుతోంది. భార‌త్‌లో చోటుచేసుకుంటున్న తాజా ప‌రిణామాల‌కు అనుగుణంగా పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హార‌శైలిలో మార్పు తీసుకురావ‌డంలో నాయ‌క‌త్వం విఫ‌మైంద‌నే చెప్పాలి. ఈ నూత‌నంగా చోటుచేసుకుంటున్న మార్పుల్లో, సైద్ధాంతిక‌త‌కు చాలా ప‌రిమిత‌మైన స్థానం మాత్ర‌మే వుంటుంది. ఫ‌లితంగా ఉద్య‌మ మ‌నుగ‌డ‌ ప్ర‌శ్నార్థ‌కంగా మార‌డం త‌థ్యం. ఈ స‌రికొత్త ప‌రిణామాల నేప‌థ్యంలో, అంత‌ర్జాతీయంగా క‌మ్యూనిజం గ‌ణ‌నీయంగా క్షీణించింద‌న్న స‌త్యాన్ని మావోయిస్టు నాయ‌క‌త్వం బ‌హుశా అంగీక‌రించి ఉండ‌వ‌చ్చు.

ముఖ్యంగా ప్ర‌జ‌ల్లో స‌మాన‌త్వ భావ‌న కంటే వ్యక్తిగ‌త ఐచ్ఛికానికే ప్రాధ‌న్య‌తనిస్తున్న స‌త్యాన్ని గ్ర‌హించ‌డం కూడా ఇందుకు కార‌ణం కావ‌చ్చు. ఈ నేప‌థ్యంలో ఉద్య‌మం విస్తృత ల‌క్ష్య సాధ‌న‌కోసం జ‌రిపే పోరాటం ఎక్కువ‌కాలం మ‌న‌లేక‌పోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలోనే హింస వ‌ల్ల ప్రాణాలు పోవ‌డం త‌ప్ప మ‌రే ఇత‌ర ఫ‌లితం లేక‌పోవ‌డంతో, మావోయిస్టు నాయ‌క‌త్వం శాంతి చ‌ర్చ‌ల వైపున‌కు మొగ్గుచూపి ఉంవ‌చ్చు. అయితే అభ‌య్ లేఖ‌ను ఖండిస్తూ జ‌గ‌న్ విడుద‌ల చేసిన మ‌రో ప్ర‌క‌ట‌న‌, సాయుధ‌పోరుపై పార్టీలో ఇంకా విశ్వాసం ఉన్న‌ద‌న్న స‌త్యాన్ని వెల్ల‌డిస్తోంది. పీపీడ‌బ్ల్యు ఇంకా ఆగిపోలేద‌ని, ప్ర‌స్తుత నిర్బంధ ప‌రిస్థితుల్లో స్వీయ ర‌క్ష‌ణ‌కోసం ఒక అడుగు వెన‌క్కు వేసిన‌ప్ప‌టికీ, అనుకూల స‌మ‌యంలో ముందుకెళ్ల‌వ‌చ్చున‌న్న న‌మ్మ‌కం వీరిలో ఇంకా కొన‌సాగుతున్న‌ద‌నుకోవాలి.  అంతేకాదు ఈ విరుద్ధ ప్ర‌క‌ట‌న‌లు గెరిల్లా యుద్ధ నీతిలో నెల‌కొన్న క‌ల‌వ‌ర‌పాటుగా కూడా భావించాలి. ఏది ఏమైనా ఒక్క‌టి మాత్రం నిజం. మావోయిస్టు పార్టీ పెను సందిగ్ధ‌త‌వైపు ప్ర‌యాణిస్తోంది. ముఖ్యంగా ఉద్య‌మాన్ని వ‌దిలేయాల‌నేవారు, కొన‌సాగించేవారుగా రెండుగా చీలిపోయే ప‌రిణామ దిశ‌గా మావోయిస్టు ఉద్య‌మ ప్ర‌స్థానం సాగుతోంది!
-శామ్ సుందర్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *