ఆరుగురు మావోయిస్టు మృతదేహాలు స్వాధీనం

మరణించిన వారిలో నలుగురు మహిళలు

వివరాలు వెల్లడించిన బస్తర్‌ ఐజి సుందర్‌రాజు

భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 19 : అబూజ్‌మడ్‌ దట్టమైన అడవులలో శుక్రవారం భద్రతా దళాలు -మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పులలో మృతిచెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను శనివారం గుర్తించారు. అభుజ్‌మద్‌లోని పరియా-కాకూర్‌ అడవుల్లో మావోయిస్టుల ఉనికి గురించి విశ్వసనీయ సమాచారం ఆధారంగా శుక్రవారం ఉమ్మడి ఆపరేషన్‌ ప్రారంభించినట్లు బస్తర్‌ ఐజి సుందర్‌రాజు, నారాయణ్‌పూర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ రాబిన్సన్‌ గురియా తెలిపారు. ఈ సంఘటన తర్వాత పిఎల్‌జిఏ ప్లాటూన్‌ నంబర్‌ 1కు చెందిన నలుగురు మహిళా కేడర్లతో సహా మొత్తం ఆరుగురు మావోయిస్టు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. డివిజనల్‌ కమిటీ స్థాయి మావోయిస్టు రాహుల్‌ పునెం మృతితో అబుజ్‌మఢ్‌ ప్రాంతంలో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణపూర్‌ జిల్లాలో పోలీసులకు ఇది పెద్ద విజయం. మృతుల తలలపై మొత్తం రూ.48 లక్షల రివార్డు ఉంది. ఈ ఆపరేషన్‌లో డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్‌, బిఎస్‌ఎఫ్‌ సంయుక్త బృందాలు పాల్గొన్నాయి. ఎన్‌కౌంటర్‌ ప్రాంతంనుండి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు, వాటిలో ఒక ఏకె 47 రైఫిల్‌, ఒక ఎస్‌ఎల్‌ఆర రైఫిల్‌, ఒక 12 బోర్‌ రైఫిల్‌, 11 రాకెట్‌ లాంఛర్లు ఉన్నాయి. 2025లో ఇప్పటివరకు బస్తర్‌ ప్రాంతంలో మరణించిన మావోయిస్టుల సంఖ్య 204కి పెరిగింది. 2025 జూలై 18 మధ్యాహ్నం నుండి, భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య అడపాదడపా కాల్పులు జరిగాయి. బస్తర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సుందర్‌రాజ్‌ పట్టలింగం, నారాయణపూర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ రాబిన్సన్‌ గురియా, బిఎస్‌ఎఫ్‌, డిఆర్‌జి,ఎస్‌టిఎఫ్‌ సీనియర్‌ అధికారులు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి మావోయిస్టుల గుర్తింపు, స్వాధీనం చేసుకున్న ఆయుధాల గురించి వివరించారు. నక్సల్‌ భావజాలంతో గందరగోళం చెంది అభివృద్ధి మార్గంలో అడ్డంకిగా మారుతున్న వారు లొంగిపోయి గౌరవ జీవితాన్ని గడపాలని, లేకుంటే వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని బస్తర్‌ ఐజి సుందర్‌రాజు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *