– బచావత్ ట్రిబ్యునల్ కు, బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలియదు
– పోలవరం, నల్లమల సాగర్‌పై సూటి సమాధానం ఏది?
– రెండేళ్లలో ఒక్క అనుమతైనా తెచ్చారా?
– రేవంత్‌పై హరీష్‌రావు విమర్శల దాడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1: ఈరోజు రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టిఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అనుముల రేవంత్ రెడ్డి. అబద్దాలకు కూడా ఆస్కార్ గనుక ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్తకంఠంతో రేవంత్ రెడ్డినే ఎంపిక చేస్తారు.బేసిన్ల పై బేసిక్ నాలెడ్జ్ లేదన్నది బహిరంగ సత్యం. ఇవాళ కొత్తగా తెలిసింది, ముఖ్యమంత్రికి బచావత్ ట్రిబ్యునల్ కు, బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలియదని వెల్లడైంది. పాపం కీర్తిశేషులైన బచావత్ ఏ లోకంలో ఉన్నారో కానీ ముఖ్యమంత్రిగా మీరు ప్రదర్శిస్తున్న అజ్ఞానాన్ని చూసి ఎంత మదనపడుతున్నారో. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం రేవంతు నైజం. సభకు వస్తే కేసీఆర్ ను అవమానించం అని ఒకవైపు చెబుతూనే అదే ప్రెస్ మీట్ లో కేసీఆర్ ను కసబ్ తో పోల్చుతావా? తెలంగాణ పోరాటాన్ని ఉరకలెత్తించి, నాలుగు కోట్ల ప్రజలను ఒక్కటి చేసి ప్రాణాలకు తెగించి నిరాహారదీక్ష చేసి నీ కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించిన మహనీయుడిని కసబ్ తో పోల్చిన నీకు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదు. నీకు తెలిసిందళ్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగం. కేసీఆర్ ను, నన్ను ఉరి తీయాలని, రాళ్లతో కొట్టాలని అంటూ అనాగరిక వ్యాఖ్యానాలు చేస్తూ మరోవైపు మర్యాద పాటిస్తానని సుద్దపూసలా నటిస్తావా? ఆవు తోలు కప్పుకున్న తోడేలువు నువ్వు. బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్లు, డొంక తిరుగుడు మాటలు మాట్లాడినవు తప్ప, పోలవరం నల్లమలసాగర్ విషయంలో నేను వేసిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు ఎందుకు? నువ్వు గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేదే నిజం అయితే, ఢిల్లీ మీటింగ్ ఎందుకు పోయినవు, కమిటీ ఎందుకు వేసినవు, ఆ కమిటీ వేసిన సంగతి ప్రజలకు వెల్లడించకుండా ఎందుకు రహస్యంగా దాచినవు? కమిటీ వేయడం అంటేనే ఏపీ జలదోపిడికి తలుపులు తెరవడం అనే విషయం మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరికైనా అర్థం అవుతది. కృష్ణాలో 763 టిఎంసీలు నువ్వు అడుగుతుంటే కేసీఆర్ 299 టిఎంసీలకు ఒప్పుకున్నాడని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అబద్దాలాడినవు. కేసీఆర్ 299కి ఒప్పుకున్నది నిజం అయితే, మొత్తం 811 టిఎంసీలు పునఃపంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఎందుకు లేఖ రాసారు? ఈరోజు నువ్వు కొత్తగా 71శాతం వాటా తెలంగాణకు రావాలని మాట్లాడినవు, ఆనాడే కేసీఆర్ గారు 811 టిఎంసీల్లో 69శాతం తెలంగాణకు దక్కాలని డిమాండ్ చేసిన విషయం నీకు తెలియదా? కేంద్రం స్పందించకపోతే సుప్రీంకు ఎందుకు వెళ్తారు? బ్రిజేష్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరపాలని ఎందుకు 28 లేఖలు రాస్తారు? రెండు అపెక్స్ మీటింగ్స్ లో కేంద్రాన్ని ఎందుకు నిలదీస్తారు?
అపెక్స్ లో మీటింగ్ మినట్స్ పంపిస్తున్నా కళ్లు పెద్దవి చేసి చదువుకో రేవంత్ రెడ్డి? సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పునః పంపిణీ జరిపిస్తామనే కేంద్రం హామీ మేరకు కేసు విత్ డ్రా చేసుకున్న సంగతి నీకు తెల్వదా? ఎందుకు ఈ నిజాన్ని దాచి పెట్టి గోబెల్స్ ప్రచారానికి ఒడిగడుతున్నావు? తెలంగాణను సాధించి, ప్రజలకు ఎంత మేలు చేసారో 9 ఏళ్ల పోరాటంతో సెక్షన్ 3 కృష్ణా జలాల పునః పంపిణీ సాధించి అంతటి మేలును తెలంగాణ ప్రజలకు చేసిన మహనీయుడు కేసీఆర్. ఆయనను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే. అన్ని నదుల నీళ్లు జూరాలకే వస్తాయి, కొత్తగా శ్రీశైలంకు వచ్చేది ఏందని అతి తెలివితో అజ్ఞానంతో మాట్లాడినవు. తుంగభద్ర అనే నది ఉందని నీకు తెలుసా. ఆ నది ద్వారా 450-600 టిఎంసీలు ప్రతి సంవత్సరం శ్రీశైలంకు వస్తాయనే కనీస జ్ఞానం నీకు లేకపాయె. ఈ సంవత్సరం జూరాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల కింద 5.50లక్షల ఎకరాల ఆయకట్టుకు మీ ప్రభుత్వమే ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించింది? అదే శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తికి లోటు లేకుండా ఈ ఏడాది 2.80లక్షల ఎకరాలకు నీళ్లు అంది స్తున్నది మీ ప్రభుత్వమే కదా? జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ రైతులకు ఈ విషయం తెలుసు. ఇంక దాని మీద పాలమూరు రంగారెడ్డి భారం కూడా పెడితే ఎవరికి నీళ్లు రాక అందరూ ఆగమైపోరా? పాలమూరు రంగారెడ్డి మీద ఎన్జీటీలో ప్రబుద్దుడు ఒకడు కేసులు వేసిండు అన్నవు, ఆ ప్రబుద్దుడిని పురమాయించింది నీ ప్రభుత్వమే కదా? అయినా పాలమూరుకు 90 టీఎంసీలకు డిపిఆర్ పంపి 7 అనుమతులు తెచ్చింది బిఆర్ఎస్, కేసీఆర్. మీరు వచ్చిన రెండేళ్ల ఒక నెలలో ఒక్క అనుమతి తెచ్చింది లేదు, డిపీఆర్ వెనక్కి వచ్చేలా చేసారు. ఇదీ నీ సమర్థత, నీ గొప్పతనం అంటూ ఎద్దేవా చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





