అనుమానంతో భార్య గొంతు కోసి చంపిన భర్త

– అడ్డు వచ్చిన కూతురు తలపై రోకలితో దాడి
– ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయ‌త్నం

– భార్య మృతి, భర్త, కూతురు పరిస్థితి విషమం

సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 19: సిద్దిపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో కత్తితో గొంతు కోసి హత్యాయత్నం చేస్తుండగా అడ్డువచ్చిన కూతురును సైతం రోకలితో తలపై కొట్టి ఆపై తాను గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలోని ఆదర్శనగర్ లో సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య శ్రీలత (32) మృతిచెందగా కూతురు హర్షిత (16), ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉంది. సిద్దిపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దూల్మిట్ట మండలం బెక్కల్ గ్రామానికి చెందిన దున్నపోతుల ఎల్లయ్య భార్య శ్రీలత, కూతురు హర్షిత, కొడుకు అజయ్‌తో కలిసి పదేళ్లుగా సిద్దిపేటలో నివాసం ఉంటున్నాడు. ఉపాధి కోసం ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లిన ఎల్లయ్య పది రోజుల క్రితమే తిరిగి సిద్దిపేటకు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.భార్యపై మొదటి నుంచే అనుమానం పెంచుకున్న ఎల్లయ్య ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. నిద్రిస్తున్న భార్య శ్రీలత, కూతురు హర్షితల గొంతులు కత్తితో కోశాడు. వారు ప్రతిఘటించడంతో ఇంట్లో ఉన్న రోకలితో తీవ్రంగా దాడి చేశాడు. అయినా వారు చనిపోలేదని భావించి పురుగుల మందు తాగించాడు. ఈ దారుణాన్ని గమనించిన కుమారుడు అజయ్ ఇంటి నుంచి బయటకు పారిపోయి కాలనీవాసులకు సమాచారం అందించాడు. స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు భయాందోళనకు గురైన ఎల్లయ్య గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీలత మృతిచెందింది. హర్షిత, ఎల్లయ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హర్షిత మిట్టపల్లి కేజీబీవీలో పదవ తరగతి చదువుతుండగా, కుమారుడు అజయ్ హైదరాబాద్ కీసరలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ ఉపేందర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *