11 ఏళ్లుగా ప్ర‌భుత్వానిది అణచివేత ధోర‌ణే

– గత సమావేశాల్లో హడావుడిగా 12 బిల్లుల ఆమోదం
– ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ విపక్షనేత ఖర్గే
– ధన్‌కడ్‌కు ఉచిత వీడ్కోలు దక్కలేదని రాజ్యసభలో ప్రస్తావన
– ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిరణ్‌ ‌రిజిజు

న్యూదిల్లీ, డిసెంబర్‌ 1: ‌పార్లమెంటరీ మర్యాదలను, పార్లమెంటరీ వ్యవస్థను గత 11 ఏళ్లుగా ప్రభుత్వం అణచివేస్తూనే ఉందని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆరోపించారు. గత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 12 బిల్లులు హడావుడిగా ఆమోదించారని, కొన్ని బిల్లులు కేవలం 15 నిమిషాల్లో ఎలాంటి చర్చా లేకుండానే ఆమోదించారని గుర్తు చేశారు. జీఎస్‌టీ, భారతీయ నాగరిక్‌ ‌సురక్షా సంహిత, రైతు వ్యతిరేక చట్టాలు పార్లమెంటు ద్వారా ప్రభుత్వం బుల్డోజింగ్‌ ‌చేసిన బిల్లులని ఆక్షేపణ తెలిపారు.పరాజయాన్ని అంగీకరించే మనసు ప్రతిపక్షాలకు లేదని, వాళ్లు వ్యూహం మార్చుకుంటే కొన్ని ’టిప్స్’ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, సభా సమయాల్లో మాత్రం డ్రామాలు వొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ‌ఖర్గే మండిపడ్డారు. శీతాకాల సమావేశాల తొలి రోజే పార్లమెంటు ముందున్న కీలక ఆంశాల గురించి మోదీ ప్రస్తావించే బదులు నాటకీయ ప్రసంగం సాగించారని తప్పుపట్టారు. 11 ఏళ్లుగా పార్లమెంటరీ మర్యాదలు, వ్యవస్థను ప్రభుత్వం అణిచివేస్తోందన్నదే అసలు నిజమని అన్నారు. మణిపూర్‌ ‌వంటి కీలక అంశాలపై విపక్షాలు అవిశ్వాస‌ తీర్మానం ప్రవేశపెట్టేంతవరకూ ప్రభుత్వం మౌనంగానే ఉండిపోయిందని, ఎన్నికల జాబితా ఎస్‌ఐఆర్‌ ‌పక్రియలో ఒత్తిడికి గురై బీఎల్‌వోలు చనిపోతే ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపులేదని విమర్శించారు. ‘వోటు చోరీ’ వంటి కీలకాంశాలను విపక్షం లేవనెత్తుతూనే ఉంటుందని, ప్రభుత్వం డ్రామాలు కట్టిపెట్టి పార్లమెంటులో ప్రజాసమస్యలపై చ‌ర్చించేందుకు ముందుకురావాలని సూచించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానత్వం, దేశ విలువైన వనరుల లూటీ వంటివి నిజమైన ప్రజాసమస్యలనీ, అయితే అధికారంలో ఉన్న వారు అధికార దురహంకారంతో డ్రామాలాడుతున్నారని ఖర్గే విమర్శించారు. బిహార్‌ ఓటమి నుంచి వాళ్లు  బయటకు రావడం లేదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ ప్రతికూల ధోరణి రాజకీయాల్లో పనికొస్తుందే కానీ జాతి నిర్మాణానికి సానుకూల ఆలోచనా దృక్పథం అవసరమని, ప్రతికూలతా ఆలోచలను ప్రభుత్వం పక్కనపెట్టి జాతి నిర్మాణంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌ ఇవాళ రాజ్యసభ చైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు నిర్వర్తించారు. చైర్మన్‌ ‌చైర్‌లో ఆయన కూర్చున్న సమయంలో ఖర్గే మాట్లాడారు. రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికిన ఆయన తన ప్రసంగంలో మాజీ చైర్మన్‌ ‌జగదీప్‌ ‌ధన్‌కడ్‌ అం‌శాన్ని ప్రస్తావించారు. ధన్‌కర్‌కు సరైన రీతిలో వీడ్కోలు దక్కలేదని, దీని పట్ల బాధగా ఉందని అన్నారు. ఆయన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరారు. ఖర్గే ఆరోపణలకు పార్లమెంట్‌ ‌వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ ‌రిజిజు కౌంటర్‌ ఇచ్చారు. ఆయన ‌రాజీనామా ఓ పవిత్ర సందర్భమన్నారు. గతంలో ధన్‌కడ్‌ పట్ల విపక్షాలు అనుచిత రీతిలో ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత ఈ సమయంలో ఎందుకు ఆ అంశాన్ని ప్రస్తావించారని అడిగారు. ధన్‌కడ్‌ను అవమానించారంటూ ఆయనను తొలగించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రిజిజు గుర్తు చేశారు. ఆ విషయాన్ని తాము మరిచిపోమన్నారు. ధన్‌కడ్‌ రాజీనామా గురించి మాట్లాడవద్దని, చైర్‌ ‌హుందాతనాన్ని ఎంతగా దిగజార్చారో తెలుసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రతి ఒక్కర్నీ గౌరవించాలని, ఇది చాలా దురదృష్టకరమని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *