ట్రంప్‌ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి

ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే

న్యూదిల్లీ, జులై 21: వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగా లోక్‌సభ, రాజ్యసభలలో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై కీలక ప్రశ్నలు వేశారు. ఇటీవలి భారత్‌-పాకిస్తాన్‌ సంఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన శాంతి ఒప్పందం వాదనలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏప్రిల్‌ 22న జరిగిన పెహల్గామ్‌ దాడి గురించి మాట్లాడుతూ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడి జరిగి నెలలు గడిచినా ఆ ఉగ్రవాదులను ఇప్పటి వరకు పట్టుకోలేదని, వారి గురించి సమాచారం కూడా లేదని అన్నారు. తమ పార్టీ మాత్రమే కాదు.. అన్ని పార్టీలు దేశాన్ని బలోపేతం చేయడానికి, సైన్యానికి ధైర్యం నింపడానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు అసలు పెహల్గామ్‌ దాడి గురించి స్పష్టమైన సమాచారం కావాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. ఇంటెలిజెన్స్‌ విషయంలో లోపం జరిగిందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చెప్పారు. ఆ క్రమంలో ఆపరేషన్‌ సిందూర్‌ గురించి ప్రభుత్వం ప్రపంచానికి, భారత ప్రజలకు చెప్పింది కానీ ఆ తర్వాత ఏమైంది, ఏం జరిగిందో సమాచారం ఇవ్వాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని 24సార్లు పేర్కొన్నారంటూ శాంతి ఒప్పందం కుదిరిందా.. కుదిరితే దాని వివరాలేమిటి.. ప్రజలకు ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. దేశ ప్రజలకు, పార్లమెంటుకు సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులనబీపు పట్టుకోవడంలో జాప్యం జరగడం, ఇంటెలిజెన్స్‌ వైఫల్యం గురించి ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఖర్గే వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ప్రభుత్వం మాట్లాడేందుకు సిద్ధంగా ఉందని, అన్ని వివరాలను దేశ ప్రజలకు తెలియజేస్తామని బీజేపీ నేత, రాజ్యసభలో లీడర్‌ ఆఫ్‌ ది హౌస్‌ జేపీ నడ్డా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *