72 ఏళ్ల వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన ‘కేర్’ వైద్యులు

– మలక్‌పేట హాస్పిటల్‌లో లాపరోస్కోపిక్‌ పిత్తాశయ ఆప‌రేష‌న్‌ విజయవంతం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 24: ప్రాణాపాయ స్థితిలో ఉన్న 72 ఏళ్ల వృద్ధురాలికి హైరిస్క్‌తో కూడిన లాపరోస్కోపిక్‌ పిత్తాశయ శస్త్రచికిత్సను మలక్‌పే కేర్‌ హాస్పిటల్స్‌ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఉదరం కుడివైపు ఎగువన తీవ్రమైన నొప్పి, హైపర్‌ టెన్షన్‌తో ఆమె హాస్పిటల్‌లో చేరింది. మొదట ఆమెకు మరో హాస్పిటల్‌లో చేసిన పరీక్షల్లో పిత్తాశయం చిట్లి తీవ్రమైన కాలిక్యులస్‌ కోలిసిస్టిటిస్‌ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే యాంటీబయాటిక్స్‌, ఐనోట్రోపిక్‌ సపోర్ట్‌ ప్రారంభించారు. ఇక ఆమెకు కరోనరీ ఆర్టరీ డిసీజ్‌, మునుపటి స్ట్రోక్‌, దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం, షుగర్‌, హై బీపీ ఉండటం, నిరంతర యాంటీ ప్లేట్‌లెట్‌ మందులు తీసుకుంటుండటం వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. దీంతో రక్తస్రావం, శస్త్రచికిత్సలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుండడంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను కేర్‌ హాస్పిటల్స్‌కు తరలించారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్‌ రోబోటిక్‌ సర్జరీ విభాగం సీనియర్‌ కన్సల్టెంట్‌ అండ్‌ హెడ్‌ డాక్టర్‌ భూపతి రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలోని బృందం లాపరోస్కోపిక్‌ అథెసియోలిసిస్‌, కోలిసిస్టెక్టమీతోపాటు పూర్తి పెరిటోనియల్‌ వాష్‌ నిర్వహించింది. శస్త్రచికిత్స సమయంలో రోగికి పెద్దమొత్తంలో సంశ్లేషణలు, పైభాగంలోని సుప్రాకోలిక్‌ కంపార్ట్‌మెంట్‌లో చీము, గ్యాంగ్రేనస్‌గా మారిన పిత్తాశయం, పూర్తిగా మూసుకుపోయిన కాలోట్‌ త్రిభుజం కనబడిరది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైద్య బృందం వెంటనే చేసిన శస్త్రచికిత్స వల్ల తీవ్రమైన సెప్సిస్‌, అవయవాల పనితీరు దెబ్బతినే ప్రమాదం తప్పింది. శస్త్రచికిత్స అనంతరం రోగిలో 24 గంటల్లోనే కోలుకునే లక్షణాలు కనిపించాయి. తర్వాత పూర్తిగా కోలుకుంది. అనేక దీర్ఘకాలిక వ్యాధులున్న ఇలాంటి వృద్ధ రోగులకు లాపరోస్కోపిక్‌గా చేయడం చాలా అరుదు. అందుకే ఈ శస్త్రచికిత్స వైద్య బృందానికి ఒక ముఖ్యమైన విజయంగా నిలిచింది. ఈ సర్జరీ గురించి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ కేసు చాలా సవాలుతో కూడినది. రోగి పిత్తాశయం చిట్లిపోయి ఇంకా అనేక ఆరోగ్య సమస్యలతో చాలా అస్థిర స్థితిలో తమ వద్దకు వచ్చారు. అలాంటి పరిస్థితిలో లాపరోస్కోపిక్‌ ఆపరేషన్‌ చేయాలంటే అత్యంత ఖచ్చితత్వం, జాగ్రత్తగా పనిచేయడం, వేగంగా సరైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం అన్నారు. తమ బృందం కనిష్ఠ ఇన్వాసివ్‌ టెక్నిక్‌లు ఉపయోగించడం, క్రిటికల్‌ కేర్‌, అనస్థీషియా బృందాలతో సమన్వయంగా పనిచేయడం వల్ల మంచి ఫలితం వచ్చిందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, అధిక ప్రమాదంలో ఉన్న రోగులకు లాపరోస్కోపిక్‌ శస్త్రచికిత్స వల్ల సమస్యలు తగ్గి తక్కువ నొప్పితో, తక్కువ రోజుల్లోనే త్వరగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. హాస్పిటల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఎడ్లా మాట్లాడుతూ ఈ విజయవంతమైన శస్త్రచికిత్స తమ హాస్పిటల్స్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ క్లినికల్‌ సిస్టమ్‌ ఎంత బలంగా పనిచేస్తున్నదో స్పష్టంగా చూపిస్తోందన్నారు. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగిని కాపాడేందుకు ఎమర్జెన్సీ బృందం స్పందన, డయాగ్నస్టిక్స్‌, శస్త్రచికిత్స నైపుణ్యం, శస్త్రచికిత్స తర్వాత క్లిష్టమైన సంరక్షణ, ఇవన్నీ ఒకే దారిలో సజావుగా జరిగాయని తెలిపారు. ప్రతీ నిమిషం కీలకమైన ఇలాంటి అధిక ప్రమాద పరిస్థితుల్లో సమయానికి, సురక్షితంగా, ఆధునిక వైద్య సేవలందించడంపైనే తమ దృష్టి ఉంటుందన్నారు. క్లినికల్‌ ఎక్సలెన్స్‌తోపాటు జట్టు సమన్వయం, రోగి-కేంద్రీకృత సేవ, ఇవి తమ బలం అని చెప్పారు. ఇలాంటి విజయాలే తమ నిబద్ధతను, ప్రాణాలను కాపాడాలన్న లక్ష్యాన్ని మరింత అర్థవంతంగా తెలియజేస్తాయి అని అన్నారు. ఇక్కడ అధునాతన పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు, బహుళ విభాగాల సహకారంతో ఇలాంటి అధిక ప్రమాదకర జీర్ణశయాంతర లాపరోస్కోపిక్‌ శస్త్రచికిత్సలు చేయగల కొన్ని ముఖ్య కేంద్రాలలో ఇది ఒకటి అని ప్రకటించారు. తీవ్రంగా లేదా ఎక్కువసేపు కొనసాగే కడుపు నొప్పిని అసలు నిర్లక్ష్యం చేయొద్దు.. సకాలంలో పరీక్షలు చేయించుకుంటే చీలికలు, సెప్సిస్‌ వంటి ప్రాణాపాయ సమస్యలను ముందే నివారించవచ్చని వైద్యులు స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page