ధాన్యం త‌డ‌వ‌కుండా తగు ఏర్పాట్లు చేయాలి

– మొంథా తుఫాన్‌తో అప్రమత్తంగా ఉండాలి
– ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌లు సమ్వయంతో వ్యవహరించాలి
– లోతట్టువారిని సహాయక శిబిరాలకు తరలించాలి
– అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌29: మొంథా తుపాను తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటి భద్రాద్రి కొత్తగూడం విూదుగా తెలంగాణలో ప్రవేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో వాయుగుండం ప్రభావంపై సీఎం అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకొని దిశానిర్దేశం చేశారు. పలుచోట్ల కల్లాల్లో ధాన్యం ఆరబోసినందున ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉండటంతోపాటు హైదరాబాద్‌, ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. గోల్కొండ, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోవడం, పలు రైళ్లను దారి మళ్లించినందున ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మొంథా తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సమన్వయం చేసుకోవాలని, కలెక్టర్లు ఆయా బృందాలకు దిశా నిర్దేశం చేయాలని సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రాణ, ఆస్తి, పశు నష్టం లేకండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదులపై జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలన్నారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్‌ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సవిూపంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖ తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఏన్కూర్‌ బ్రిడ్జి వద్ద కొట్టుకుపోయిన డీసీఎం

ఖమ్మం: తుపాన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో గల అంజనాజపురం నిమ్మవాగు బ్రిడ్జిపై నుండి నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పల్లిపాడు `ఏన్కూర్‌ మార్గంమధ్యలో ఉన్న బ్రిడ్జిపై పొంగిపొర్లుతున్న నీటి ప్రవాహం నుంచి డ్రైవర్‌ డీసీఎం వ్యానును దాటించే ప్రయత్నం చేయగా బ్రిడ్జి మధ్యలోకి రాగానే వాహనం ఆగిపోపోయింది. డీసీఎంను వదిలి ఒడ్డుకు రావాలని స్థానికులు ఎంత చెప్పినా డ్రైవర్‌ వినలేదు. దీంతో డీసీఎం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. డ్రైవర్‌ కూడా నీటిలో గల్లంతయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *