యూరియాపై ప్రణాళికలు రూపొందించండి

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: కేంద్రం ప్రకటించిన విధంగా సరఫరాలు జరుగుతాయని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణంగా జిల్లాల వారీ ప్రణాళిక చేసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దిగుమతి యూరియాలో మన రాష్ట్రానికి కేటాయించిన యూరియా సరఫరా జరగకపోవడం మూలంగా దేశీయంగా ఉత్పత్తయ్యే యూరియాను కేటాయించవల్సిందిగా కేంద్ర మంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల అవసరాల మేరకు నిల్వలున్నాయని, అయితే చాలా పంటలు ఆరంభ దశలో ఉండటం వల్ల యూరియా అవసరమున్నా లేకపోయినా రైతులు కొనుగోలు చేస్తున్నారని, కేంద్రం నుండి ఆగస్టు నెలకు కూడా సరిపడా ఎరువులు త్వరలోనే రాష్ట్రానికి అందుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాలవారీ యూరియా లభ్యత, రోజువారీ కొనుగోళ్ల వివరాలను అధికారులు మంత్రికి తెలియజశారు. జిల్లాల వారీ సాగు విస్తీర్ణాలు, కేంద్రం నుండి సరఫరా అవుతున్న పరిమాణాలను బట్టి జిల్లాల వారీ ప్రణాళిక చేసుకోవల్సిందిగా మంత్రి సూచించారు. ఏ మండలంలో ఎక్కడా లోటు లేకుండా ఎరువులను ఆయా మండల కేంద్రాలలో సిద్ధం చేసే బాధ్యత జిల్లా అధికారులు తీసుకోవాలని, ఎక్కడైనా, ఏ డీలరైనా సొసైటీ నిర్వహకులతో సహా యూరియా బస్తాను అధిక ధరకు విక్రయించినా, యూరియా బస్తాలకు లింక్‌ పెట్టి వేరేవి అమ్మాలని చూసినా లేక ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడానికి చూసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి జులై వరకు కేటాయించిన 6.60 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చేవరకు నిత్యం కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవల్సిందిగా అధికారులను ఆదేశించారు. రైతులు కూడా తమకు అవసరమైన మేరకే బస్తాలు కొనుగోలు చేయాలని, జులై మాసంలో ఇప్పటివరకే 86 వేల టన్నుల బస్తాలు రైతులు కొనుగోలు చేశారని, గత ఏడాదితో పోల్చుకుంటే 25 వేల టన్నులు అధికమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *