– సూర్యాపేట పట్టణాభివృద్ధికి కృషి చేస్తా
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: పురపాలక సంఘాన్నిఅవినీతి రహితంగా తీర్చిదిద్దాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట పురపాలకానికి కొలువుదీరబోయే పాలకవర్గానికి హితవు పలికారు. గతంలో సూర్యాపేట పురపాలక సంఘంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలు పునరావృతం కాకుండా నూతన పాలకమండలి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఉద్బోధించారు. నూతనంగా ఎన్నికైన సూర్యాపేట పురపాలక సంఘం ప్రతినిధులు హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. 48 వార్డులకు గాను 31 స్థానాలలో విజయం సాధించిన కౌన్సిలర్లను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారి మీద ఉన్న సూర్యాపేట పట్టణం ఇప్పటివరకు ఊహించిన మేరకు అభివృద్ధి సాధించ లేకపోయిందన్నారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై చూపిన ఆదరణ అనన్య సామాన్యమైనదని, ప్రజలు మనమీద అపారమైన నమ్మకంతో గురుతర బాధ్యత మోపారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు కొత్త కౌన్సిలర్లు పనిచేయాలని ఉపదేశించారు. జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా సూర్యాపేట పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఎప్పటికప్పుడు పట్టణాభివృద్ధిపై సమీక్షించుకుని ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అందుకు సరిపడ నిధులు తెచ్చి సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పీసీసీ¾ కార్యదర్శి చకిలం రాజేశ్వర్‌రావులు కూడా మంత్డ్రిని కలిసిన వారిలో ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




