– అగర్వాల్ పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మెరుగైన నష్టపరిహారం
– ప్రతి పరిశ్రమ భద్రత ప్రమాణాలు పాటించాలి
పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 24: కార్మిక రంగం నుండి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్ కార్మిక రంగానికి అండగా నిలుస్తూ వారి కష్టనష్టాల్లో ముందుంటున్నారు. తాజాగా బీహార్ రాష్ట్రానికి చెందిన సురేష్ సింగ్ యాదవ్ (34) పటాన్ చెరు డివిజన్ పరిధిలోని అగర్వాల్ రబ్బర్స్ పరిశ్రమలో గత 12 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం పరిశ్రమలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ యాజమాన్యాన్ని సంప్రదించగా, నామమాత్రపు నష్టపరిహారం చెల్లిస్తామని సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని స్థానిక కార్మిక నాయకులు ఎమ్మెల్యే జీఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జీఎంఆర్ కంపెనీ ఎండి అమిత్ అగర్వాల్ తో చర్చించారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 60 లక్షల రూపాయలతో పాటు అంత్యక్రియల ఖర్చు నిమిత్తం లక్ష రూపాయలు అందించేలా యాజమాన్యాన్ని ఒప్పించారు. అనంతరం బంధువుల సమక్షంలో పరిశ్రమ ప్రతినిధులతో అంగీకార పత్రాన్ని అందించారు. రెండు రోజుల్లో నష్టపరిహారానికి సంబంధించిన పూర్తి డబ్బులు అందిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు. సేఫ్టీ నిబంధనలు పాటించకుండా పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల జీవితాలను ప్రమాదాల్లోకి నెట్టి వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమలలో పనిచేస్తున్న క్యాజువల్, కాంట్రాక్ట్ కార్మికులకు పని ప్రదేశాల వద్ద పూర్తి స్థాయి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు. ఈ సమావేశంలో కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర్, ఉత్తర భారతీయ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.




