– మంత్రి సీతక్క
భూపాలపల్లి, ప్రజాతంత్ర, జులై 18 : ఇందిరా గాంధీ స్పూర్తితో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టారని పంచాయతీరాజ్, గ్రామీణాభివ`ద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోందని, కోటిమంది మహిళలను కోటీిశ్వరులను చేయడమే లక్ష్యమని చెప్పారు. మహిళలు ఆర్దికంగా ఎదగాలి.. కోటిశ్వరులుగా అభివృద్ది చెందాలి అని ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో మహిళలను తమ ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని, వారిని పారిశ్రామికవేత్తలుగా చేయడమే ధ్యేయమని చెప్పారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులుగా చేరితే ఎన్నో లాభాలున్నాయని, ఆర్దిక ప్రయోజనాలతోపాటు సామాజిక భద్రత లభిస్తుందని, మహిళలను ఆర్దికంగా బలోపేతం చేస్తే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీదే మంజూరు చేస్తున్నామంటూ మహిళలను ఇంటి యజమానులుగా చేస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు. ఒకవేళ మహిళలను భర్తలు వేధిస్తే వారిని ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టొచ్చని ఆమె చమత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్యకు రూ.1.85 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.49.03 కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాల చెక్కు అందజేశారు. అలాగే రూ.38.90 లక్షల లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కుల పంపిణీ చేపట్టారు. ఇందిరా మహిళా శక్తి సంబురాలకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.
మహిళా శక్తి సంబరాలను ఓర్వలేని బీఆర్‌ఎస్
తాను దొరసానిని కాదు.. తాేను మంత్రిని అయినా ప్రజల మధ్య ఉంటాను.. తన చుట్టూ పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నారు.. అందులో ఒక మహిళ పొరపాటున కూరగాయల బుట్టను తగిలితే అవి కింద పడ్డాయి.. దాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం ఏం సంస్కారం అని సీతక్క బీఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించారు. కూరగాయల బుట్ట కిందపడితే కూడా మైండ్ లేకుండా ఆ నాయకులు కొందరు ఏదో అపచారం జరిగినట్లు ప్రచారం చేస్తున్నారు.. దాన్ని పట్టుకొని జర్నలిస్టుల ముసుగులో ఉన్న కొందరు బీఆర్‌ఎస్ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు.. అసలు వాళ్ళకి మైండ్ ఉందా అని ప్రశ్నించారు. మహిళా సంఘాలకు రూ.3000 కోట్ల వడ్డీలను ఎగ్గొట్టిన బీఆర్‌ఎస్ ఇందిరా మహిళా శక్తి సంబరాలను చూసి ఓర్వలేకపోతోందన్నారు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది సీతక్క విమర్శించారు.





