– బతుకమ్మ పండుగను తలపించిన ఉత్సవాలు
– మంత్రులు, ఎమ్మెల్యేల చెక్కుల పంపిణీతో వెల్లివిరిసన ఉత్సాహం
– రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు
– ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో అగ్ర భాగాన మంత్రి సీతక్క
– నేటితో ముగియనున్న సంబురాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: ఇందిరా మహిళా శక్తి సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాన్ని తలపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వినూత్న కార్యక్రమాలతో మహిళా స్వయం సహాయక బృందాలు సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఆ సంబురాలు బతుకమ్మ వేడులకు తలపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో మహిళా సభ్యులు పాల్గొంటూ తమకు దక్కిన గౌరవాన్ని చాటుతున్నారు. ఆర్దిక విజయాలు సాధించిన మహిళా సంఘాలు మంత్రుల నుంచి సన్మానాలు అందుకున్నాయి. ఈ సంబురాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటూ వడ్డీ చెక్కులను పంపిణి చేస్తున్నారు. మహిళా శక్తిని అభినందిస్తూ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన కార్యక్రమాలను వివరిస్తున్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు. మహిళా సంఘాలచే ఆర్టీసీ నూతన అద్దె బస్సులను, వివిధ వ్యాపారాల ప్రారంభోత్సవాలు చేస్తూ వాటిని ప్రొత్సహిస్తున్నారు. ఈ సంబురాల్లో భాగంగా మహిళల విజయగాథలు, ప్రభుత్వ ప్రొత్సాహంతో సాగిస్తున్న వ్యాపారాలు, పొందుతున్న ఆదాయం, తమ వ్యాపార అనుభవాలను వేదికలపై వివరించారు. వేల కోట్ల రుణ సదుపాయం కల్పించడంతోపాటు అన్ని వ్యాపారాల్లో తమకు అవకాశం కల్పిస్తున్న ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు శుక్రవారంతో ముగియనున్నాయి. పది రోజుల పాటు నియెజకవర్గాల్లో మహిళా సందోహమే కనిపించింది. ఇందిరా మహిళా శక్తి ఉత్సవాలు మహిళా సాధికారతకు వేదికగా నిలిచాయని చెప్పొచ్చు. ఈ సంబురాల్లో భాగంగా ఈ దఫా మహిళా సంఘాలకు రూ.344 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఇందులో గ్రామీణ మపిళా సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ మహిళా సంఘాలకు రూ.44 కోట్ల చెల్లింపులు చేసింది.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆడబిడ్డలను ఆర్దికంగా బలోపేతం చేసేందుకు, వారిచే సొంత వ్యాపారాలను ప్రారంభింప చేసేందుకు ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో బాగంగా ఏటా కనీసం రూ.25 వేల కోట్లకు తగ్గకుండా బ్యాంక్ లింకేజ్ ద్వారా మహిళా సంఘాలకు ప్రభుత్వమే రూణాలను సమకూర్చుతోంది. ఈ రుణాలకు సకాలంలో వడ్డీలు చేల్లిస్తోంది. దీంతోపాటు ప్రమాద బీమా, లోన్ బీమా వంటి స్కీంలను అమలు చేస్తోంది. ఇప్పటివరకు 410మంది సభ్యులకు ప్రమాద బీమా కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చెల్లించగా, లోన్ బీమా కింద 5,474మంది సభ్యులకు రూ.2 లక్షల వరకు చెల్లింపులు చేసింది. ప్రమాద బీమా, లోన్ బీమాతోపాటు ప్రజా ప్రభుత్వం సకాలంలో వడ్డీలు చెల్లిస్తుండటంతో మహిళా సంఘాల్లో కొత్త సభ్యులుా చేరుతున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 1.67 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో కొత్తగా చేరారు. దీంతోపాటు మహిళా సంఘాల్లో చేరే సభ్యుల అర్హత వయసును 15-65 ఏండ్లకు పెంచారు. దీంతోపాటు దివ్యాంగ మహిళలకు ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియ ఊపందుకుంది. దీంతో రాష్ట్రంలో మహిళా సంఘాలకు ప్రాధాన్యత విశేషంగా పెరుగుతోంది. మహిళా స్వయం సహాయక సంఘాల్లో ప్రస్తుతం ఉన్న 64 లక్షల సభ్యత్వాన్ని కోటి వరకు చేర్చే కార్యాచరణను అమలు చేస్తున్నారు.
సంబురాల్లో చురుగ్గా మంత్రి సీతక్క
ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క చురుకైన పాత్ర పోషిస్తు మహిళా శక్తిని చాటుతున్నారు. రాష్ట్ర కేబినెట్ సభ్యులంతా తమ సొంత నియోజకవర్గాల్లో, తాము ఇన్‌చార్జిగా ఉన్న జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొంటూ విజయవంతం చేస్తున్నారు. కాగా, మంత్రి సీతక్క మాత్రం కామారెడ్డి, పెద్దపల్లి, ములుగు, ఇల్లందు, భూపాలపల్లితోపాటు ఇతర నియోజకవర్గాల్లో వరుస కార్యక్రమాల్లో పాల్గొని మహిళల్లో ఉత్తేజాన్ని నింపారు. ఆడబిడ్డల భాగస్వామ్యంతో రైజింగ్ తెలంగాణ-2047 లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకాన్ని గురువారం ములుగులో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల వేదికగా వ్యక్తపరిచారు. ప్రభుత్వ ప్రొత్సాహంతో స్వయం ఉపాధి నుంచి సంపద సృష్టి దాకా మహిళా సంఘాలు ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేసి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతం చేస్తామని ప్రకటించారు. ఇందిరా మహిళా శక్తి సంబురాలను విజయవంతం చేసిన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. సంబురాలను సజావుగా సాగేలా కృషి చేసిన సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, అడిషనల్ సీఈవో కాత్యాయని, జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు, జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆమె అభినందించారు.





