విశేష ఫలితాలు సాధిస్తున్న ఖమ్మం మహిళా మార్ట్‌

– రూ.30 లక్షల పెట్టుబడితో ప్రారంభం
– మహిళా సంఘాల ఉత్పత్తులకు వేదిక
– ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి అవకాశాలు
– మూడు నెలల్లో రూ.25 లక్షల విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లు
– మహిళా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం వినూత్న పథకాలు

ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్‌ మూడు నెలల్లోనే విశేష ఫలితాలు సాధించింది. మహిళా సంఘాల కృషితో తయారైన ఉత్పత్తులకు మార్కెట్‌ లభించడంతోపాటు గ్రామీణ, పట్టణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం లభించడమేకాక మధ్యవర్తుల అవసరం లేకుండా ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు సరకులు నేరుగా చేరుతున్నాయి. సహజసిద్ధమైన, నాణ్యమైన ఉత్పత్తులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. వినియోగదారులు చూపుతున్న విశ్వాసం మహిళా మార్ట్‌ విజయానికి బలమైన పునాది అయింది. త్వరలో మరిన్ని కొత్త ఉత్పత్తులు, విభాగాలను ప్రవేశపెట్టే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

25 లక్షల విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లు

ఇప్పటివరకు మహిళా సంఘాల నుండి రూ.25 లక్షల విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేశారు. సాధారణ రోజుల్లో సుమారు రూ.35 వేల సేల్స్‌ ఉండగా, వారాంతంలో రూ.50 వేలు దాటుతున్నాయి. ఇప్పటివరకు రూ.18.75 లక్షల అమ్మకాలు జరగగా మూడు నెలల్లోనే మార్ట్‌ లాభాల బాటలో పయనిస్తోంది. నేరుగా విక్రయాలు జరపడం వల్ల ఉత్పత్తిదారులకు లాభంతోపాటు వినియోగదారులకు సరసమైన ధరలో వస్తువులు లభిస్తున్నాయి.

వెయ్యికిపైగా మహిళా సంఘాల ఉత్పత్తులు

ఈ మార్ట్‌లో 20 మండల సమాఖ్యల 95 మహిళా సంఘాలచే ఉత్పత్తి అయిన బియ్యం, బెల్లం, తేనె, మసాలా పొడులు, గానుగ నూనెలు, పూజా సామగ్రి, పప్పులు, పిండ్లు, మిల్లెట్స్‌, చేనేత వస్త్రాలు, మట్టి పాత్రలు, వెదురు ఉత్పత్తులు, క్లీనింగ్‌ ప్రొడక్టులు, హస్తకళా వస్తువులు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. మహిళా సంఘాలు స్వయంగా తయారు చేయడం వల్ల నమ్మకమైన, నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలలో వినియోగదారులకు అందుతున్నాయి. వినియోగదారుల రాక పెరగడంతో టీ క్యాంటీన్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజుకు సుమారు రూ.4 నుండి రూ.5 వేల సేల్స్‌ నమోదవుతోంది.

వేలాది మహిళలకు ప్రత్యక్ష-పరోక్ష ఉపాధిమహిళా మార్ట్‌లో ప్రస్తుతం ఐదుగురు మహిళలు పనిచేస్తున్నారు. వీరు కార్పొరేట్‌ స్థాయిలో మార్ట్‌ను విజయవంతంగా నడుపుతూ కుటుంబ ఆదాయానికి తోడ్పడటమే కాక జిల్లా ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములుగా నిలుస్తున్నారు. పరోక్షంగా వందలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఉత్పత్తి, ప్యాకేజింగ్‌, రవాణా వంటి విభాగాల్లో వేలాదిమందికి జీవనోపాధి కలుగుతోంది.

మహిళా సాధికారతకు ప్రభుత్వ వినూత్న పథకాలు

మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తూ మహిళా సంఘాలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. వడ్డీ లేని రుణాలతోపాటు పెట్రోల్‌ బంకులు, ఆదర్శ పాఠశాలలు, మహిళా క్యాంటీన్లు, స్కూల్‌ యూనిఫాం కుట్టుట వంటి రంగాల్లో అవకాశాలు కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు మహిళా మార్ట్‌లతో మరో అడుగు ముందుకు వేసింది. ఖమ్మం మహిళా మార్ట్‌ విజయవంతం కావడంతో ఇతర జిల్లాల్లో కూడా విస్తరణకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మహిళా సంఘాలు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుని ఇతర మహిళలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ఖమ్మం మహిళా మార్ట్‌ మహిళల శక్తిని, సృజనాత్మకతను, కృషిని ప్రతిబింబిస్తూ జిల్లాలో మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి, స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహానికి, సమాజ ప్రగతికి ఉదాహరణగా నిలుస్తోంది.

ఖాలీ గా ఉన్న నేను ఇప్పుడు రూ.15 వేలు సంపాదిస్తున్నా: భవాని

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం తమతోపాటు ఎందరో మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది. పోటీ పెరగడంతో కొత్త ఉత్పత్తుల తయారీకి మహిళలు ముందుకొస్తున్నారు. మార్ట్‌ ప్రారంభించినప్పుడు ఉత్పత్తులు తక్కువగా ఉండేవి. సేల్స్‌ ఎక్కువ అవడంతో మహిళా సంఘాలలో ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్పత్తులను పెంచారు. తద్వారా ఎస్‌హెచ్‌జి, మార్ట్‌ రెండిరటి రాబడి పెరుగుతోంది. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. వినియోగదారులకు మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చే విధంగా ఎస్‌హెచ్‌జిలతో సమన్వయం చేస్తున్నాం. గతంలో నేను ఖాళీగా ఉండేదాన్ని. ఇప్పుడు నెలకు రూ.15 వేలు సంపాదిస్తూ మార్ట్‌ నడపడం గర్వంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి, జిల్లా యంత్రాంగానికి రుణపడి ఉంటాం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *