– ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాలతోనే..
– జనహిత పాదయాత్రపై మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతోనే జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ పాదయాత్రపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు. పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మహేష్ గౌడ్ మాట్లాడారు. ప్రజలకు చేరువయ్యేందుకే పాదయాత్రలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. కాగా, స్థానికల సంస్థల ఎన్నికలపై మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వే ఆధారంగా గెలిచే వారికే సీట్లు ఇస్తామని తేల్చిచెప్పారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు పదవులు ఇస్తామని ఉద్ఘాటించారు. కొత్త వారు వచ్చినా పాత నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం కొనసాగుతుందని చెప్పారు. కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. పాలనలో మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడిరచారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీపై అధ్యయనం జరుగుతోందన్నారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ గోదావరిలో మూడు వేల టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని, వాటిని ఏపీ వాడుకోవచ్చని గతంలో కేసీఆర్ అన్నారని, అందుకే ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించిందని గుర్తు చేశారు. ఇపుడు సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కుల గణన కోసం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పోరాటం చేశారని, ఆయన కోరిక సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కుల గణన చేపట్టారని, అయితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తాను ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితిలో బీసీలపై ప్రేమ ఒలకబోస్తున్నదని అని మహేష్‌కుమార్ గౌడ్ విమర్శించారు. పాదయాత్రలో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ పార్టీలో గ్రూపులను పక్కనబెట్టి అందరినీ నేతలు కలుపుకుని వెళ్లాలని సూచించారు. నాయకులు లోపాలను సరిదిద్దుకుని సమాజానికి నచ్చిన నాయకుడిని ముందుకు తీసుకెళ్లాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని ఉద్బోధించారు. ప్రజల కోసం, సమాజాభివృద్ధి కోసమే పనిచేయాలన్నారు. ఎన్నికలు వచ్చినపుడు బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని సీతక్క మండిపడ్డారు.





