మహావీరుని బోధనలు అందరికీ ఆదర్శం

– హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక
– మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్
– ఉత్సాహభరితంగా శోభా యాత్ర
– వైభవంగా భగవాన్ మహావీర్ జయంత్యుత్సవాలు
– జైన్ సమాజం సామజిక సేవలు ప్రశంసనీయం
– బీఆర్ఎస్ నేత‌ హరీష్ రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 31: అహింస, సత్యం, మరియు ఆత్మనిగ్రహం వంటి భగవాన్ మహావీరుని సూత్రాలు, ప్రగాఢమైన ఆధ్యాత్మిక బోధనలు అందరికి ఆదర్శమ‌ని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ చెప్పారు. జైన మత స్థాపకులు, 24వ తీర్థంకరులైన భగవాన్ మహావీరుని 2625వ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ జైన్ సేవా సంఘ్ హైదరాబాద్ లో అత్యంత వైభవంగా నిర్వహించింది. తొలుత మహావీర్ జయంతిని పురస్కరించుకొని శ్రీ జైన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో బేగం బజార్, ఫీల్ ఖానా జైన్ మందిరం నుండి భక్తి, సాంస్కృతిక వైభవంతో మేళవించిన ఉత్సాహభరితమైన భారీ శోభా యాత్ర ప్రారంభమై నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు సాగింది. ఈ ఊరేగింపులో మహావీర్ ప్రధాన రథం, విభిన్న ఇతివృత్తాలతో కూడిన శకటాలు, సాంప్రదాయ దుస్తులలో పురుషులు, మహిళలు పిల్లలు, సంగీత బృందాలు, గుర్రపు బగ్గీలు, యువతుల స్కూటర్ ర్యాలీ, పవిత్రమైన కుండలను మోస్తున్న మహిళలు పాల్గొన్నారు. అంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన జయంత్యుత్సవాలను మహావీర్ చిత్రపటానికి ఫూలమాలలు వేసి, జ్యోతిని వెలిగించి అజారుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ చరిత్రాత్మక గంగా-జమునీ తెహజీబ్ లో భాగంగా అన్ని మతాలను గౌరవించడం ద్వారా దేశంలో హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదన్నారు. అన్ని మతాల మధ్య ఐక్యత, సహజీవనాన్ని పెంపొందించే సమ్మేళన సంస్కృతి కొనసాగుతూనే ఉండాలన్నారు. బీఆర్ఎస్ నేత‌ టి.హరీష్ రావు మాట్లాడుతూ భగవాన్ మహావీర్ చెప్పిన అహింస పరమో ధర్మః అనే సందేశం కేవలం మాట కాదని, అది ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన జీవన విధానమని అన్నారు. హింస, ద్వేషం పెరుగుతున్న ఈ కాలంలో మహావీరుని బోధనలు సమాజానికి దిక్సూచిగా నిలుస్తాయని తెలిపారు. తెలంగాణ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని, జైన, బౌద్ధ ఆరామాలకు ఈ నేల కేంద్రంగా ఉందని హరీష్ రావు తెలిపారు. తమ ప్రభుత్వంలో జైన్ సమాజానికి తగిన ప్రాధాన్యం కల్పించామని, మైనార్టీ కమిషన్‌లో సభ్యత్వం, ఉప్పల్ భగాయత్‌లో జైన్ భవన్ కు భూమి కేటాయింపు వంటి చర్యలు తీసుకున్నామని వివరించారు. జైన్ సమాజం సామజిక సేవలు ప్రశంసనీయం అన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అహింస, సత్యం వంటి భగవాన్ మహావీర్ బోధించిన సూక్తులను ప్రతి ఒక్కరు పాటించి సన్మార్గంలో నడవాలని కోరారు. విశ్వ హిందూ పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు హుకుంచంద్జీ సావ్లా మాట్లాడుతూ మహావీర్ జయంతి జైన పండగ అయినప్పటికీ భగవాన్ మహావీరుని బోధనలు మతపరమైన సరిహద్దులను అధిగమించి మానవాళికి శాశ్వతమైన జ్ఞానాన్ని అందిస్తాయన్నారు. ప్రముఖ భక్తి గాయని గాయకులూ భక్తి పాటలను ఆలపించగా, రాష్ట్ర మైనారిటీల కమిషన్ సభ్యుడు హిమాన్షు బాప్నా, శ్రీ జైన్ సేవా సంఘ్ మార్గదర్శక మండల్ చైర్మన్ యోగేష్ కుమార్ సింగి, అధ్యక్షులు ఉమేష్ బాజీరెచ్ఛ, సీనియర్ ఉపాధ్యక్షుడు కైలాష్ భండారి, ఉపాధ్యక్షుడు వినోద్ ముఖాన, కార్యదర్శి విమల్ ముథ, కోశాధికారి సురేష్ సూరన, సంయుక్త కార్యదర్శి యోగేష్ సోని, ముఖ్య కన్వీనర్ లు సునీల్ కావడియా, దిలీప్ భండారి, దిలీప్ షెటియా, వర్కింగ్ కమిటీ సభ్యులు అశోక్ ముథ, మనోజ్ టాటెడ్, రాకేష్ సూరన, మహావీర్ టాటెడ్, జైన సాధువులు, సాధ్విలు, జైన ఆచార్యులు, సంతులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *